లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారా..? అందులో భాగంగానే ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ను కూల్చాలని కేసీఆర్ బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారా..?
అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం నారాయణపేట జన జాతర సభలో ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కూతురు జైలు పాలైతే ఆమెను కాపాడుకునేందుకు బీజేపీతో జత కట్టారని ఆరోపించారు. బిడ్డను కాపాడుకునేందుకు ప్రధాని నుంచి సుపారీ తీసుకున్నారని ఆరోపించిన రేవంత్…అందులో భాగంగా చేవెళ్ల ,మల్కాజ్ గిరి , జహీరాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టారన్నారు.
తనను పడగొట్టేందుకు కేసీఆర్ , నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ , బీజేపీ నేతలు ఎక్ నాథ్ షిండే వ్యాఖ్యలు చేస్తుండటంతో రేవంత్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మల్కాజ్ గిరి , సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా… బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ సుపారీ తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్.
లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆమెకు ఊరట లభించడం లేదు. ఇప్పటికప్పుడు ఆమెకు బెయిల్ లభించే అవకాశం కనబడటం లేదు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపణల నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. నిజంగానే కవిత కోసం మోడీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? అనే చర్చ జరుగుతోంది.