మాజీమంత్రి పెద్దిరెడ్డి సైతం ఆలోచనలో పడ్డారా? సొంత పార్టీ నేతల తిరుగుబాటుతో ఆయనలో అంతర్మథనం ప్రారంభమైందా? రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకోవాలని పెద్దిరెడ్డి ఆలోచనకు రాబోతున్నారా…? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
పెద్దిరెడ్డి.. చిత్తూర్ జిల్లాను మొత్తం కనుసైగలతో శాసించిన లీడర్. అయితే ఇది ఇప్పుడు కాదు… వైసీపీ హయాంలో. కాలం తిరగబడినట్లే.. క్యాడర్ సైతం తిరగబడుతోంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో పుంగనూరులో ఆ పార్టీని వీడెందుకు నేతలు రెడీ అయిపోయారు. మరికొంతమంది ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. పరిస్థితి చూస్తుంటే కొద్ది రోజుల్లోనే పుంగనూరు వైసీపీలో పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తప్పా ఎవరూ మిగిలే అవకాశం లేదన్న టాక్ నడుస్తోంది.
ఇందుకు వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరు ఓ కారణమైతే, పెద్దిరెడ్డి అండతో నాడు రెచ్చిపోయి ప్రవర్తించడంతో క్యాడర్ సైతం కేసుల భయంతో జంప్ చేసేందుకు సిద్దపడుతోంది. ఇప్పుడు పెద్దిరెడ్డిపైనే కేసులు నమోదు అవుతున్నాయి. ఆయననను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో వైసీపీలో కొనసాగలేమని పెద్దిరెడ్డి సన్నిహిత నేతలు ఆయనకు మొహమాటం లేకుండా చెప్పి వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి సైతం ఆలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన కుమారుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని, పెద్దిరెడ్డి ఈ ప్రయత్నాలను నిలువరించారని ప్రచారం నడిచింది. వీటిని మిథున్ రెడ్డి ఖండించారు కూడా. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితుల్లో కొంత మార్పు కనబడుతోంది. పెద్దిరెడ్డిపై కేసులు నమోదు అవుతుండటంతో ఆయన మనసు మార్చుకున్నారని..ఈ కేసుల నుంచి ఉపశమనం పొందే మార్గంపై ఆయన దృష్టిసారించారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.