రెండు రాష్ట్ర ప్రభుత్వాలు శత్రు దేశాల్లా యుద్ధం చేయడం ప్రపంచ చరిత్రలో మన దగ్గరే జరుగుతుందేమో. మాటల యుద్ధం. కేసుల యుద్ధం. పోలీసుల లాఠీల యుద్ధం. ప్రాజెక్టులపై యుద్ధం. ఉద్యోగుల పంపిణీపై యుద్ధం. కరెంటుపై యుద్ధం. అడుగడుగునా యుద్ధం. ఇది ప్రచ్ఛన్న యుద్ధం కాదు. అచ్చంగా ప్రత్యక్ష యుద్ధమే.
ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వారు దోషులో కాదో కోర్టు తేలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ ప్రభుత్వానికి ఏమైనా ఆధారాలుంటే కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకు పోవచ్చు. ఏదైనా చట్ట ప్రకారం జరగాలి. కానీ మాటలను మర ఫిరంగుల్లా పేల్చే అతి దారుణమైన సంస్కృతి ఈమధ్య మొదలైంది. ఈ పరిస్థితుల్లో స్వయంగా రాష్ట్రపతి మన రాజధాని నగరంలో 10 రోజులు బస చేశారు. జూన్ 29 నుంచి జులై 8 వరకు దక్షిణాది పర్యటనకు వచ్చి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. తిరుమల, యాదగిరిగుట్టల్లో దైవ దర్శనం చేసుకున్నారు.
రాజ్ భవన్లో విందుకు హాజరయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ రాసిన పుస్తకం తొలికాపీని అందుకున్నారు. బొల్లారం భవంతి ఆవరణలో ఉల్లాసంగా గడిపారు. అనేక మంది రాజకీయ నాయకులు కలిసి అనేక ఫిర్యాదులు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం రెండు రాష్ట్రాల్లో ఎంత ఘోరంగా అభాసు పాలవుతోందో దగ్గరి నుంచి చూశారు. రెండు ప్రభుత్వాలు భారత్ పాకిస్తాన్ లా కొట్టుకోవడం గమనించారు.
మరి, రాష్ట్రపతిగా రెండు ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణకు సీరియస్ గా ప్రయత్నించి ఉంటారా? ఇరుకు పొరుగుతో సఖ్యతగా మెలగమని ట్వీట్ చేశారు. దాంతోనే ఇద్దరు ముఖ్యమంత్రుల మనసు మారితే ఇంకేముంది? మరి సమస్య పరిష్కారానికి రాష్ట్రపతి ఏమైనా చొరవ చూపారా? గవర్నర్ కు ఏమైనా దిశానిర్దేశం చేశారా?
రాష్ట్రపతిని కలిసి అనేక సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాభివందనం చేశారు. మర్యాదగా చేశారో మార్కులు కొట్టేయడానికి చేశారో ఆయనిష్టం. రాష్ట్రపతి హోదాలో ఉన్న వారు కేవలం పాదాభివందనం చేసిన వారికి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారని అనుకోలేం. పదిరోజులు పర్ల్ సిటీ ఆతిథ్యం స్వీకరించిన ప్రథమ పౌరుడు, రెండు కొత్త రాష్ట్రాల ప్రభుత్వాలు కొట్టుకోవడం మానేసి మంచి పనిలో, అభివృద్ధిలో పోటీ పడేలా సరైన దిశానిర్దేశం చేసే ఉంటారా? ప్రస్తుతానికి ఇది జవాబు లేని ప్రశ్నే.