రజనీకాంత్ సినిమా అంటే ఓ పండగే. చిన్న అప్డేట్ కూడా సెన్సేషన్ అవుతుంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటినుంచే అభిమానుల్లో సందడి మొదలైపోతుంది. అయితే ఇదంతా ఒకప్పుడని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆయన సినిమా చుట్టూ సరైన బజ్ వుండటం లేదు. కబాలి సినిమా వరకూ రజనీ మానియా వుండేది. ఆ సినిమా రిలీజ్ కి కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవలు కూడా ఇచ్చినట్లు వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడా ప్రాబల్యం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
రజనీ నుంచి వేట్టయన్ సినిమా దసరాకి వస్తోంది. రజనీ నుంచి సినిమా అంటే ఎంత హంగామా వుండాలి, ఎంత సందడి కనిపించాలి.. ఇవేవి ఈ సినిమాపై లేవు. తెలుగులో అసలు ప్రచారమే లేదు. పైగా తమిళ టైటిల్ నే వుంచేయడం మరో మైనస్. డై హార్ట్ రజనీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఉత్సాహంగా లేరు.
ప్రమోషనల్ కంటెంట్ లో కూడా మెరపులు లేవు. రజనీ లుక్ జైలర్ లా వుంది. ఒక పాట హిట్ అయ్యింది కానీ ఆ క్రెడిట్ మంజు వారియర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. రీల్స్ లో ఆమెనే వైరల్ అయ్యింది. రజనీని కట్ చేసి కేవలం మంజు వున్న పోర్షన్ నే ఎక్కువగా షేర్ చేయడం గమనించవచ్చు.
ఇక్కడ రజనీ సినిమాకి బిజినెస్ తెలుగు టాప్ హీరోలకి ధీటుగా జరుగుతుంది. కానీ వేట్టయన్ ఇంతకి ఇచ్చారో, ఎంతకి తీసుకున్నారో సడిచప్పుడు లేదు. దానిపై ఎవరికీ ఆసక్తి కూడా కలగడం లేదు.
సినిమాల్లో సూపర్ స్టార్స్ ఎక్కువైపోయారు. ముఖ్యంగా తమిళ్ లో విజయ్, రజనీ స్థానాన్ని ఆక్రమించుకున్నాడని అర్ధమౌతుంది. రజనీ మాస్ అంతా మెల్లగా విజయ్ వైపు తిరగడం సహజంగా జరుగుతోంది.
తమిళ్ లో హీరోలని దైవంగా ఆరాదించే కల్చర్ వుంది. రజనీని కూడా అలానే ఆదరించారు. నిజంగా రజనీ రాజకీయాల్లోకి వచ్చి తమ జీవితాల్లో కొత్త మార్పులు తీసుకోస్తారని చాలా మంది ఆశించారు. కానీ రజనీ తన వ్యక్తిగత కారణాల వలన రాజకీయలకు దూరంగా జరిగారు. ఈ గ్యాప్ ని విజయ్ ఫిల్ చేశాడు. నిజంగా రజనీ రాజకీయాల్లోకి వచ్చి వుంటే తమిళనాట సినీ రాజకీయ ముఖ చిత్రం మరోలా వుండేది. ఇప్పుడా క్రేజ్ అంతా విజయ్ వైపు తిరిగింది. ఈ పొలిటికల్ ఎఫెక్ట్ కూడా రజనీ సినీ ఇమేజ్ పై పడింది.
ఇప్పుడు రజనీ సినిమాపై మునపటి వైబ్రేషన్ లేదు. అయితే రజనీ మానియాని అప్పుడే తేలిగ్గా తీసుకోలేం. ఈ రోజుల్లో సినిమాకి డైరెక్టర్ కాంబినేషన్ కూడా చాలా కీలకమైయింది. నెక్స్ట్ రజనీ నుంచి కూలీ సినిమా వస్తోంది. లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. అతని సినిమాలు పాన్ ఇండియాలో సందడి చేస్తాయి. ఇది క్రేజీ కాంబినేషన్. ఈ సినిమా విషయంలో రోబో, కబాలికి కనిపించిన వైబ్ ప్రేక్షకుల్లో మళ్ళీ కనిపిస్తే రజనీ ప్రాబల్యానికి డోకా లేదని చెప్పుకోవచ్చు.