హైదరాబాద్: తెలుగు మీడియారంగ దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నాస్తికుడని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరంలేదు. తెలుగువారందరికీ అది తెలిసిన విషయమే. కమ్యూనిస్ట్ భావజాలం నిండిన రామోజీ తన చిత్రనిర్మాణసంస్థకుగానీ, ఇతర సంస్థలకుగానీ దేవుడి పేర్లు పెట్టలేదు. సంస్థకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలలోగానీ, వార్షికోత్సవాలలోగానీ, ఇతర కార్యక్రమాలలోగానీ పూజలలో ఆయన పాల్గొనరు. ఈ మధ్యదాకా రాశిఫలాలను, తిథి-నక్షత్రాలను ఈనాడులో ఇచ్చేవారుకాదు(కుమారుడు కిరణ్ అజమాయిషీలోకి వచ్చిన తర్వాత ఆ విధానం మారిందనుకోండి).
అయితే నిన్న పేపర్లు చూసినవారికి దైవభక్తి విషయంలో రామోజీ ఆలోచనలు మారాయా అని సందేహం కలుగుతోంది. శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తీసుకోవటానికి ఒడిషా వెళ్ళిన రామోజీ, అక్కడున్న సుప్రసిద్ధ పూరి జగన్నాథుడి ఆలయాన్ని సందర్శించటమే కాకుండా నుదుటిన బొట్టుపెట్టుకుని మీడియాకు కనిపించారు. పూజారులు ఇచ్చిన శేషవస్త్రాన్నికూడా పైన కప్పుకున్నారు. ఇది ఆయన గురించి తెలిసినవారందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎనభయ్యో పడికి చేరువైన రామోజీ(నవంబర్ 16, 1936) జీవితపు చరమాంకంలో ఆధ్యాత్మికంవైపుకు మళ్ళారా అని చర్చ జరుగుతోంది. మార్గదర్శి విషయం, కొడుకు సుమన్ చనిపోవటంవంటి విఘాతాలను ఎదుర్కోవటంవలన ఆయన ఆలోచనాధోరణి మారిందా అనే వాదనకూడా వినబడుతోంది.
అయితే దీనంతటికీ భిన్నంగా మరో వాదన వినిపిస్తోంది. ఫిల్మ్‌సిటీలో రామోజీరావు ప్రతిష్ఠాత్మకంగా ఆధ్యాత్మిక నగరం ఓం సిటీ నిర్మాణాన్ని ప్రారంభించారు(అప్పుడే కొందరు సందేహాలు లేవదీశారు… రామోజీ ఆధ్యాత్మికంవైపుకు మళ్ళారా అని). అక్కడ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలూ, దేవాలయాలన్నింటి ప్రతిరూపాలనూ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూరి ఆలయాన్ని పరిశీలించటానికి వెళ్ళి ఉంటారని అంటున్నారు. ఈ వాదనలోనూ సత్యంలేకపోలేదు. అయితే పూజలు-పునస్కారాలకు ఆమడ దూరంలో ఉండే రామోజి నుదుటన బొట్టు పెట్టుకోవటం,శేషవస్త్రాన్ని స్వీకరించటంమాత్రం విచిత్రంగా ఉంది. మరి ఆయన దైవం విషయంలో మనసు మార్చుకున్నారో, లేదో తెలియాలంటే ఓం సిటీ ప్రారంభమయ్యేదాకా ఆగాల్సిందేనేమో(అప్పుడు ఎలాగూ తన స్టాండ్ చెప్పక తప్పదు కదా!).