తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారా..? కేసీఆర్ , కేటీఆర్ లను కాదని ఇటీవల హరీష్ రావును రేవంత్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?తన దూకుడుతో హరీష్ ను సైతం లాక్ చేయాలని రేవంత్ భావిస్తున్నారా..?
తెలంగాణ రాజకీయాల్లో చేరికల విషయంపై ఎంత చర్చ నడుస్తుందో.. ఈ అంశంపై కూడా అంతే బిగ్ డిబేట్ నడుస్తోంది. ఎన్నికలకు ముందు నుంచి కూడా కేసీఆర్, కేటీఆర్ లపై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన రేవంత్ కొద్దిరోజులుగా హరీష్ రావును టార్గెట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్ , కేటీఆర్ లు హరీష్ రావు ట్రాప్ లో ఉన్నారని, దాంతో కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని ఆరోపించడం సంచలనంగా మారింది.సడెన్ గా హరీష్ లక్ష్యంగా కేసీఆర్ , కేటీఆర్ లపై అటాక్ కు దిగడం వెనక రేవంత్ లక్ష్యం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను తప్పించి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే డిమండ్ చేస్తున్నారు. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే హరీష్ రావుకు కీలక బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ ల నేపథ్యంలో కేసీఆర్ కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. వీటిని అంచనా వేసే రేవంత్ తన స్ట్రాటజీ మార్చారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా.. హరీష్ రావు కోటరీలోని ఎమ్మెల్యేలను సైతం లాగేసుకోవాలంటే..హరీష్ ను లాక్ చేయాలనే ఉద్దేశంతోనే వ్యూహం మార్చి రేవంత్ విమర్శలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.