తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి చేసిన వ్యాఖ్యలు సామాన్య జనంలోనూ విపరీతంగా చర్చనీయాంశమయ్యారు. నిజానికి గత కొంత కాలంగా ఏపీలో ఉన్న పరిస్థితుల్నే కేటీఆర్ చెప్పారు. అందులో కొత్త విషయాలు లేవు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రులే ఒప్పుకుంటారు. కరెంట్ కోతల గురించి పవర్ హాలీడేల ఆదేశాలే సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇలాంటివన్నీ నిజాలే. కానీ టీఆర్ఎస్ నేతలు… ముఖ్యంగా కేటీఆర్ చెప్పి హేళన చేయడమే కొత్త మార్పు. కొత్త విషయమేం కాదుకానీ కొత్తగా చెప్పారు. ఎందుకిలా అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో భిన్న చర్చలకు కారణం అవుతోంది.
వైసీపీతో టీఆర్ఎస్కు దూరం పెరిగిందా!?
టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో వైసీపీకి ఎంత మేర సహకరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని ప్రకటించిమరీ జోక్యం చేసుకుంది. టీఆర్ఎస్కు ఆర్థికంగా అండందండలు అందించిందని చెబుతూంటారు. ఇక తెలంగాణ పోలీసులు టీడీపీని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టారో చెప్పాల్సిన పనిలేదు. అదంతా వైసీపీ ఫేవర్ కోసమే. ఆ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ఎలాంటి నిర్ణయాలైనా తీసుకున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం జగన్ నోరెత్తలేదు. రాజకీయంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు. అనేక విషయాల్లో కేటీఆర్ జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. చివరికి మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా సమర్థించారు. కానీ హఠాత్తుగా జగన్ సర్కార్ పరువు తీసేలా మాట్లాడారు. దాంతో అంతర్గతంగా ఏం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది.
జాతీయ రాజకీయాల్లో కలసి రావడానికి జగన్ నిరాకరించారని కోపమా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేసీఆర్ – జగన్ విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు బీజేపీపై ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా వారి మధ్య భేటీలు ఆగిపోయాయి. బీజేపీతో పోరాటం అంటే.. తమ పరిస్థితి ఏమవుతుందో తెలిసి కూడా తమ చర్చలను కేసీఆర్ లీక్ చేశారని జగన్ ఆ తర్వాత అసంతృప్తికి గురయ్యారని చెప్పుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ అగ్రెసివ్‌గా బీజేపీపై పోరాటానికి వెళ్తున్నారు. అనేక మందిని కలుపుకుని వెళ్లాలనుకున్నారు. ఎవరూ కలిసిరాలేదు. చివరికి జగన్ కూడా కలిసి రాలేదు. ఈ అసంతృప్తి టీఆర్ఎస్ నేతల్లో ఉందని అది కేటీఆర్ మాటల రూపంలో బయటపడిందని అంటున్నారు.
టీఆర్ఎస్ను విమర్శించడానికి భయపడుతున్న వైసీపీ !
కేటీఆర్ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా… టీఆర్ఎస్ను విమర్శించడానికి వైసీపీ నేతలు జంకుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని రాజకీయం చేయదల్చుకోలేదని.. జగన్ అభిప్రాయాల్ని తన నోటి ద్వారా చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి విన్నవించుకున్నారు. మిగిలిన వారిదీ అదే. టీఆర్ఎస్తో లడాయి పెట్టుకుంటే ఇబ్బందేనని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే.. కేటీఆర్ ఎన్నిమాటలన్నా.. రోజా నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. టీఆర్ఎస్ దూరం పెట్టినా.. అవమానించినా వైసీపీ మాత్రం టీఆర్ఎస్కు దూరం జరిగే అవకాశం లేదని చెప్పుకోవచ్చు.
వైసీపీ, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్నకొత్త రాజకీయమా ?
అటు కేటీఆర్ ప్రకటన.. ఆ వెంటనే వైసీపీ నేతల స్పందనలు చూస్తే.. తెలంగాణలో తగ్గిపోతున్న సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే వ్యూహాత్మక ప్రయత్నంలాగా కొంత మంది అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడం.. అధికార వ్యతిరేకత పెరగడంతో టీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. టీడీపీ బలంగా ఉన్నట్లయితే ఆ పార్టీని బూచిగా చూపి… టీఆర్ఎస్కు బలం పెంచే చాన్స్ ఉండేది. కానీ ఇప్పుడది లేదు. అందుకే.. దాన్ని పెంచడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న కొత్త రాజకీయంగా కొంత మంది భావిస్తున్నారు.