భారతీయులపై అమెరికాలో హేట్ స్పీచ్‌లు పెరిగిపోతున్నాయి. హెచ్వన్ బీ వీసాల విషయం నుంచి ప్రారంభమైన ఈ చర్చ అమెరికా అభివృద్ధిలో వైట్ యూరోపియన్ల పాత్ర ఎంత.. ఇండియన్స్ పాత్ర ఎంత అనే చర్చ వరకూ వచ్చింది. ఈ చర్చల్లో ఇండియన్స్ అసలు పాల్గొనడం లేదు. అమెరికన్లు అని చెప్పుకునే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారే చేస్తున్నారు. ఇండియన్స్ పై ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండియాను కించ పరుస్తున్నారు. విషాదం ఏమిటంటే వీరంతా ట్రంప్ మద్దతుదారులు.
ట్రంప్ తన ఎన్నికల అవసరాల కోసం అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని వినిపించారు. ఆయన మద్దతుదారులు దీన్ని అమెరికన్స్ ఫస్ట్ అని మార్చుకున్నారు. ఏదైనా ముందు తమకే అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇంత కాలం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మంచి టాలెంట్ ను పట్టుకుని అభివృద్ది చెందిన అమెరికన్లు టాలెంట్ లేకపోయినా తమకే చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. ఈ అమెరికన్లు ఏమీ అమెరికా మూలాలున్నవారు కాదు. పుట్టుకతో మాత్రమే అమెరికా పౌరసత్వం పొందిన వారు ఎక్కువ. వారి తల్లిదండ్రులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. స్వయంగా ట్రంప్ తల్లిదండ్రులు అమెరికాకు చెందిన వారు కాదు.
భారతీయులు అమెరికాలో కష్టపడి పని చేసి మంచి అవకాశాలు పొందుతున్నారు. ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు. టెక్నికల్ గా వారిని కొట్టడం ఈ సోకాల్డ్ అమెరికన్లకు సాధ్యం కావడం లేదు. అందుకే రెచ్చిపోతున్నారు. చివరికి ట్రంప్ కూడా తన టీమ్ లోకి భారతీయుల్ని తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఏఐ విభాగానికి సలహాదారుగా వివేక్ కృష్ణమూర్తిని తీసుకున్నప్పటి నుంచి ఈ తరహా చర్చ ప్రారంభమైంది. హెచ్ వన్ బీ వీసాలపై వచ్చే వారిపై ఎక్కువగా ఈ ట్రంప్ మద్దతుదారులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరిక్లను ఉద్యోగాల నుంచి తీసేసి .. హెచ్ వన్ బీ వీసాల ద్వారా ఇండియన్స్ కి ఉద్యోగాలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
టాలెంట్ అవసరమైన వారందరూ హెచ్ వన్ బీ వీసాలను సమర్థిస్తున్నారు. ట్రంప్ కు కూడా సమర్థించక తప్పలేదు. కానీ ఆయన భావజాలాన్ని మరో రకంగా అన్వయించుకున్న వారు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇది భారతీయులపై అమెరికాలో వివక్షను పెంచే సూచనలు కనిపిస్తూండటమే ఆందోళనకరం.