హైదరాబాద్: ఏడాది చివరలో బాలీవుడ్లో ఒక సర్ప్రైజ్ హిట్ వచ్చింది. మహేష్ భట్ సోదరులు విశాల్ పాండ్య దర్శకత్వంలో రూపొందించిన హేట్ స్టోరీ 3 మంచి హిట్ అయి కూర్చుంది. రు.13 కోట్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం మొన్న 4వ తేదీన రిలీజ్ అయ్యి, మొదటి మూడు రోజులలోనే రు.26.82 కోట్లు వసూలు చేసింది. మొదటి 10 రోజులలోనే రు.50 కోట్ల మైలురాయి దాటుతుందని తరుణ్ ఆదర్శ్ వంటి బాలీవుడ్ సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ హిట్ చిత్రం ఇన్డీసెంట్ ప్రపోజల్ కథ ఆధారంగా తీసిన ఈ చిత్రం పోర్న్ సినిమాలాగా ఉందని రివ్యూలలో రాశారు. ఇద్దరు వ్యాపార వేత్తలు ఒకరినొకరు దెబ్బతీయటానికి చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వ్యాపార వేత్తలుగా శర్మాన్ జోషి, కరణ్ సింగ్ గ్రోవర్ నటించగా, హీరోయిన్లుగా జరీన్ ఖాన్, డైసీ షా నటించారు. కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోయినా, ఎడిటింగ్ బాగుండటంతో సినిమా వేగంగా సాగిపోయినట్లుగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దానికి తోడు హాట్ సీన్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి కదా!