ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత కుటుంబాన్ని ఎంతగా మోసం చేశారో ఆయనకు రక్త సబంధీకుల్లో ఎదురవుతున్న తిరస్కరణ ఓ సాక్ష్యంగా కనిపిస్తోంది. షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ కు వెళ్తే ఆయనతో ఒక్కరంటే ఒక్కరూ నోరు తెరిచి పలకరించలేకపోయారు. సాక్షాత్తూ సీఎంవో విడుదల చేసిన వీడియోలోనే జగన్ రెడ్డి తో మాట పలకరింపులు కూడా ఎవరూ చేయలేదు. మొహమాటానికి నవ్వులు మాత్రమే కనిపించాయి. సొంత మేనల్లుడి పెళ్లిలో జగన్ రెడ్డి ఒక్క నిమిషం మాత్రమే ఉన్నారు. ఈ వీడియోలు చూసిన తర్వాత జగన్ రెడ్డి అధికారం అనే అహంకారం తెచ్చుకుని అన్నీ కోల్పోయారన్న భావన ఎక్కువ మందికి వస్తోంది.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కాబోయే దంపతుల్ని విష్ చేయడానికి వస్తే షర్మిల ఆదరంగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా ఫోటో దిగారు. కానీ ఆ ఆప్యాయతను పొందడానికి సొంత అన్నకు అదృష్టం లేకుండా పోయింది. అంతగా కుటుంబసభ్యుల్ని జగన్ రెడ్డి ఎందుకు దూరం చేసుకున్నారు ?. ఒక్క షర్మిల కాదు వైఎస్ ఫ్యామిలీలో ఇప్పుడు జగన్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించే వారే లేకుండా పోయారు. ఒక్క అవినాష్ రెడ్డి తప్ప. ఆయన కూడా తనపై వివేకా హత్య కేసు మీద పడుతుందని తెలిసిన మరుక్షణం ప్లేటు ఫిరాయిస్తారు. అధికారం పోయిన వెంటనే అదీ జరుగుతుంది. మరి జగన్ రెడ్డి ఎవరి అభిమానాన్ని కాపాడుకున్నట్లు ?
వైఎస్ ఉన్నప్పుడు భయంతోనో.. భక్తితోనే ఆ కుటుంబం అంతా ఒక్కటిలాగానే ఉండేది. ఎవరికి పదవులిస్తే వారికే. అయితే జగన్ రెడ్డి కుటుంబ పెద్దరికం తీసుకున్న తర్వాత కుత్సిత మనస్థత్వంతో వ్యవహరించడంతో ఆయన పెద్దరికానికి అందరూ గుడ్ బై చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు. చివరికి చెల్లి షర్మిల కూడా సొంత పార్టీ పెట్టుకున్నారు. నేరుగా జగన్ పైనే యుద్ధం ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో ఆయన ఎంత కోల్పోయారో తెలిసేలా.. గోల్కొండ రిసార్ట్స్ వేదికగా నిలిచింది. ఎంత మోసం చేస్తే ఇంత తిరస్కారం వస్తుందన్న అనుమానాలు సామాన్యుల్లో వస్తున్నాయి.