భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నిర్వహిస్తామని చెప్పి ..ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రత్యర్థులను అవమానించేందుకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో ఇతర పార్టీల వారెవరూ కనిపించలేదు. అయితే బీజేపీ నేతలు లేకపోతే వైసీపీ నేతలు. టీడీపీ అధినేతకు ఆహ్వానం పంపామని.. అచ్చెన్నాయుడు కార్యక్రమం ఆద్యంతం పాల్గొంటారని చెప్పారు. కానీ చివరికి జాబితాలో అచ్చెన్న పేరు లేదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం లేఖ వచ్చినా ఆయన పేరు లేదని కలెక్టర్ చెప్పడంతో ఆయన ఆగిపోయారు. పిలిచి అవమానించారని వారు మండిపడ్డారు. జనసేన పరిస్థితి అదే. బీజేపీకి చెందిన చోటా నేతలు.. జిల్లా అధ్యక్షుల పేర్లు కూడా కనించాయి కానీ.. ఇతర పార్టీల నేతల పేర్లు మాత్రం కనిపించలేదు. వచ్చినా ఘోరంగా అవమానించి పంపేసి ఉండేవారే.
ఈ మాత్రం దానికి ఎందుకు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంగా ప్రచారం చేశారన్నది అర్థం కాని ప్రశ్న. ఈ అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తిగా పట్టు కోల్పోయారని.. చివరికి వచ్చే సరికి రాష్ట్ర అధికారులు మొత్తం కలగాపులగం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మాత్రం దానికి పార్టీలకు అతీతం చెప్పి ఆహ్వానం పేరుతో హడావుడి చేయడమేమిటన్న విమర్శలు ఇతరుల నుంచి వస్తున్నాయి.
రఘురామకూ అదే పరిస్థితి. అయితే రఘురామ , అచ్చెన్న లాంటి వాళ్లు హాజరయితే తమకు ఇబ్బందని పట్టుబట్టి వారి పేర్లను తొలగింప చేశారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన రియాక్షన్స్ ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.