మావోయిస్టు నాయకుడు అక్కిరాజు రామకృష్ణ (ఆర్కే) ఏమయ్యారు అనేది ఇంకా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలి ఉంది. ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారంటూ చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉంటే ఆ విషయాన్ని దాచి పెట్టాల్సిన పనేముంది అనేది పోలీసుల వాదన. మొత్తానికి ఆర్కే ఆచూకీ వ్యవహారం హైకోర్టుకు చేరుకుంది. తన భర్త ఎక్కడున్నారో తెలియజేయాలనీ, కోర్టు ముందు ప్రవేశపెట్టాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటీషన్ను హైకోర్టులో దాఖలు చేశారు కందుల శిరీష. ఈ పిటిషన్పై ధర్మాసనం స్పందించింది. ‘ఆర్కే ఏమయ్యారు.. అసలు ఉన్నారా లేరా.. ఉంటే ఎక్కడున్నారు’ అనే విషయమై వచ్చే గురువారం నాటికి వెల్లడించాలంటూ సర్కారును కోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికంగా మారాయి. ఎన్కౌంటర్ మీద వస్తున్న ఆరోపణల్ని ఖండించడం అనేది సరికాదంటూ ఏపీ సర్కారుకు అక్షింతలు వేసింది. ఎన్కౌంటర్లో ఆర్కే అక్కడిక్కడే మరణించి ఉండాలి, లేదా అక్కడి నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకుని ఉండాలి, లేదా పోలీసుల అదుపులో ఉండాలి… ఈ వ్యవహారంలో ఈ మూడింటికే ఆస్కారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఆర్కే సురక్షింగా ఉన్నారంటే, ఆ విషయాన్ని ఇప్పటికే ఎలాగోగా ప్రకటించేవారు కదా అంటూ కోర్టు అనుమానం వ్యక్తం చేయడం విశేషం! అంతేకాదు, ప్రభుత్వం దృష్టిలో అందరి ప్రాణాలు ఒకటేననీ, మావోయిస్టులైనా సాధారణ ప్రజలైనా సమానంగా చూడాలంటూ క్లాసు తీసుకుంది. ఆర్కే తప్పించుకుని ఉంటే ఇవాళ్ల ఈ వ్యవహారం కోర్టు దాకా వచ్చి ఉండేది కాదని, ఒకవేళ ఆయన్ని సజీవంగా పట్టుకుని ఉంటే ఆర్కే ప్రాణాలకు ఎలాంటి ముప్పూ ఉండదన్న విశ్వాసం తమకు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆర్కే వ్యవహారంలో చంద్రబాబు సర్కారుకు గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పాలి. ఆర్కే విషయంలో అందరి చూపులూ పోలీసుల వైపే ఉన్నాయి. కోర్టు కూడా సర్కారు తీరుపై అక్షింతలు వేసింది. మరి, గురువారం నాడు ఏపీ సర్కారు ఏ వివరాలను బయటపెడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఏదైమైనా ఆర్కే విషయమై కొన్ని రహస్యాలు ఉన్నాయనేది రానురానూ స్పష్టమౌతోంది.