మీడియాకు సంకేళ్లు వేసేలా… జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన జీవోపై.. హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్చను.. హరిస్తూ.. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారంటూ.. దాఖలైన ఓ ప్రజాప్రయోజాన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. గతంలో..రద్దయిన ఓ జీవో రిఫరెన్స్‌తో .. మరో జీవో తేవడం ఏమిటని.. ప్రభుత్వాన్నిప్రశ్నించింది. జీవోపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 2430ని జారీ చేసింది. దీనిపై.. దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దేశంలో ఎన్నో రకాల ప్రభుత్వాలు వచ్చాయి కానీ.. ఇంత వరకూ.. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా భావించే.. మీడియాపై.. మాత్రం ఇలా కత్తి పెట్టలేదని.. అభిప్రాయపడ్డారు. జాతీయ మడియా.. స్వతంత్ర మీడియా ఆర్గనైజేషన్స్ సహా.. అందరూ ఖండించారు. ఈ జీవోను .. ఏపీ సర్కార్ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా.. తమకు వ్యతిరేక కథనాలు వచ్చినప్పుడల్లా.. ఆ జీవో పేరుతో.. కేసులు పెడతామనే హెచ్చరికలు మాత్రం మంత్రుల వద్ద నుంచి వస్తున్నాయి.
మీడియాపై.. వైసీపీ సర్కార్.. మొదటి నుంచి ఉక్కుపాదం మోపుతూనే ఉంది. తమకు వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నారని.. టీవీ చానళ్లపై బ్యాన్ వేసి.. టీడీశాట్, ట్రాయ్‌తో అక్షింతలు వేయించుకుంది. ఆ తర్వాత.. కొన్ని పత్రికలకు ప్రకటనలు నిలిపివేసింది. ఈ క్రమంలో.. జర్నలిస్టులపై కేసులు పెట్టడానికి కూడా సాహసిస్తోంది. ఇప్పుడు.. ఈ విషయంలో హైకోర్టుకు చేరింది. రాజ్యాంగం ప్రకారం.. ఆ జీవో భావప్రకటనా స్వేచ్చను హరించేలా ఉందన్న అభిప్రాయం.. న్యాయవాద వర్గాల్లో ఉంది. దీని ప్రకారం.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినా ఆశ్చర్యం లేదంటున్నారు.