ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ న్యాయసమీక్షలో తేలిపోతున్నాయి. ఇప్పటికే రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు.. ప్రకాశం జిల్లాలో మైనింగ్ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజధాని భూములపై సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్ పిటిషన్ వేసి ఎదురుదెబ్బలు తిన్నది. తాజాగా…స్కూళ్లు, కాలేజీలు, విద్యాలయాలకు సంబంధించిన భూములను ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేస్తూ.. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేసింది.
విశాఖలో అనంతగిరి గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడంపై పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. విద్యా సంస్థల భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం 30 లక్షల మంది సెంటు స్థలం ఇస్తామంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హడావుడి చేస్తోంది. అయితే.. చట్ట పరంగా సాధ్యం కాని రీతిలో కన్వేయన్స్ డీడ్ల ద్వారా ఇచ్చేందుకు సిద్ధమవడంతో.. కోర్టులో ఆగిపోయింది.
డి పట్టాల ద్వారా ఇస్తే వెంటనే ఇచ్చేయవచ్చు కానీ ప్రభుత్వం అలా ఇవ్వదల్చుకోలేదు. మరో వైపు.. ఇలా ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాలన్నీ…మైనింగ్ భూములు, విద్యాసంస్థల భూములు, స్మశాన భూములు,చెరువు భూములు కావడంతో… ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరికి అన్నీ కోర్టుల్లో ఇరుక్కుపోతున్నాయి. ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ పోతోంది.