ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు తీసేయాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా.. సమర్థించింది. ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా… తక్షణం రంగులు తొలగించడానికి ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో హైకోర్టు పది రోజుల గడువు ఇచ్చింది. అది అయిపోయి చాలా కాలం అయింది. తాజాగా.. మూడు నెలల గడువు ఇవ్వాలంటూ.. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టు… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగులు తొలగించడానికి మూడు నెలల గడువు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. రంగులతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలోనే ఇలాంటి గడువు కోరుతున్నారన్న అనుమానాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. దీంతో లాక్డౌన్ ఎత్తేశాక రాజకీయ పార్టీల రంగు తొలగించి కొత్త రంగులేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారుల నుంచి సమాచారం తీసుకొని కోర్టుకు చెబుతామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. దాంతో సోమవారానికి పిటిషన్ వాయిదా పడింది.
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడం అనేది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. ప్రభుత్వం కొన్ని వందల కోట్లు వెచ్చించి రంగులు వేయించింది. ఎన్నికల సమయంలో.. ఎన్నికల కోడ్ ప్రకారం.. ప్రభుత్వ భవనాలపై ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉండకూడదు. కానీ.. ప్రభుత్వం మాత్రం.. ఈ అంశాన్ని లైట్ తీసుకుని తన పని తాను పూర్తి చేసింది. కోర్టులో మాత్రం ఆ నిర్ణయం నిలబడలేదు. కోర్టులు చెప్పినా రంగులు తొలగించకపోతే ఏమవతుందిలే అనుకున్నట్లుగా ఇంత కాలం వ్యవహరించింది. సుప్రీంకోర్టు కడా అలా రంగులు ఉండటాన్ని తప్పు పట్టడంతో.. తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఓ మూడు నెలలు వాయిదా అడిగితే.. తర్వాత ఏదో ఒకటి చేయవచ్చన్న ఉద్దేశంతో ..మళ్లీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో హైకోర్టు.. ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. గతంలో పది రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. ఆ పది రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు.. మూడు నెలలు గడువు అడిగింది. సోమవారం.. ఎన్ని రోజుల్లో రంగులు మారుస్తామో ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేయాల్సి ఉంది. ఎన్ని రోజులు అడుగుతారు.. కోర్టు ఎన్ని రోజులు సమయం ఇస్తుందన్నది సోమవారం తేలనుంది. ఎలా చూసినా.. రంగులు తొలగించక తప్పని పరిస్థితి ఏపీ సర్కార్ పై పడింది.