పదహారో తేదీన విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు శంఖుస్థాపన చేయాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించలేదు. స్టేటస్ కోను.. ఇరవై ఏడో తేదీ వరకూ పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం.. సీఆర్డీఏఅ చట్టాన్ని రద్దు చేయడంపై హైకోర్టులో 55 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై గత విచారణలో కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజుల సమయాన్ని ప్రభుత్వం అడిగింది. ఆ పది రోజులు చట్టాలను అమలు చేయకుండా.. హైకోర్టు స్టేటస్ కో విధించింది. పది రోజుల తర్వాత నేడు జరిగిన విచారణలో .. కేసును వాయిదా వేసినా స్టేటస్ కోను మాత్రం కొనసాగించవద్దని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు.
అయితే.. పిటిషనర్ల తరపు న్యాయవాదులు మాత్రం… అసలు చట్టాలే రాజ్యాంగ విరుద్ధమని విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు… కరోనా సమయంలో ఇంత ఎమర్జెన్సీగా.. కార్యాలయాలను తరలించాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. స్టేటస్కోను కొనసాగిస్తున్నామని తెలిపింది. ఈ నెల ఇరవై ఏడో తేదీ వరకూ స్టేటస్ కో అమల్లో ఉంటుంది. విచారణను కూడా ఇరవై ఏడో తేదీకి వాయిదా వేశారు. ప్రభుత్వం ఇప్పటికే స్టేటస్ కో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ముందుగానే విచారణకు వస్తుందని.. స్టే వస్తే పదహారో తేదీన శంఖుస్థాపన చేసేయాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు.
కానీ పిటిషన్లు తప్పుల తడకలుగా వేయడం వల్ల సుప్రీంకోర్టులోవిచారణకు రావడం ఆలస్యం అయింది. ఈ లోపు హైకోర్టులోనూ స్టేటస్ కో ఎత్తివేయడంపై సానుకూల నిర్ణయం రాలేదు. ఒక వేళ సుప్రీంకోర్టులో స్టేటస్ కోపై స్టే వస్తే… ఆ తర్వాత శంకుస్థాపన గురించి.. ఏపీ సర్కార్ ఆలోచన చేసే అవకాశం ఉంది. లేకపోతే.. మళ్లీ హైకోర్టులో ఇరవై ఏడో తేదీన వాదనలు వినిపించాల్సి ఉంటుంది.