తుని విద్వంసంలో పాల్గొన్నట్లు అనుమానిస్తూ స్థానిక వైకాపా ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదో ఒకరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది కనుక ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఆ విద్వంసంలో పాల్గొనలేదని, కానీ తాను వైకాపాకి చెందిన ఎమ్మెల్యే అయిన కారణంగానే పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, కనుక తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆయన అభ్యర్ధనను హైకోర్టు మన్నించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఆయన నేరం చేయలేదు కనుక ఆయనని నిందించలేము. అలాగే ఇదివరకు పోలీసులు అరెస్ట్ చేసిన 13మందికి కూడా ఆ నేరం చేయలేదు కనుక వారినీ ముద్రగడ నిరాహార దీక్ష చేసి విడిపించుకొన్నారు. కనుక ఆ కేసులో ఎవరూ నిందితులు కారు ఎవరినీ అనుమానించడానికి లేదు. కనుక ఎవరినీ అరెస్ట్ చేయడానికి కూడా వీలులేదు. ఎవరూ ఆ నేరం చేయకపోయుంటే రైలు దానంతట అదే ఆగిపోయి మంటలు అంటించుకొని ఆత్మహత్య చేసుకొందా? పోలీసు వాహనాలు కూడా మంటలు అంటించుకొని ఆత్మహత్యలు చేసుకొన్నాయా? నేలమీదున్న రాళ్ళు వాటంతట అవే గాలికి ఎగిరివచ్చి తుని పోలీస్ స్టేషన్ పై వర్షంలా కురిసాయా? అనే అనుమానం కలుగుతోంది. ఈ కేసు కూడా సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు, కృష్ణ జింకల కేసుల సరసన చేరిపోతుందేమో?
పట్టపగలు కొన్ని వేలమంది సమక్షంలో జరిగిన ఆ విద్వంసంపై ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేకపోవడం, దర్యాప్తు చేసి ఆధారాలతో సహా అరెస్ట్ చేసినా ఒత్తిళ్ళకి లొంగి వారిని విడిచిపెట్టవలసిరావడం చూస్తే మన రక్షణ, న్యాయ, ప్రభుత్వ వ్యవస్థలు ఇంత బలహీనంగా ఉన్నాయా! అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కేసులో పోలీసులు మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేసినా మళ్ళీ ఇలాగే జరుగవచ్చు. ప్రభుత్వం ఎవరినీ శిక్షించలేదని స్పష్టం అయిపోయింది. కనుక ఇంకా ఈ దర్యాప్తులు, అరెస్టులు చేయడం మానుకొంటే మేలేమో. తుని విద్వంసంలో రూ.106 కోట్లు నష్టం జరిగినట్లు సమాచారం. ఈ దర్యాప్తులు, అరెస్టులు చేస్తూ వాటి కోసం ఇంకా విలువైన ప్రజాధనం వృధా చేసుకోవడం ఎందుకు ఏమీ సాధించలేనప్పుడు?అని సామాన్యుల సందేహం.