హైదరాబాద్: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో బుకీలతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వచ్చిన శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్లకు కింది కోర్ట్‌లో విముక్తి లభించిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు ఆ కేసును అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఈ ఏడాది జులై 25న కింది కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్ట్, నిందితులుగా ఉన్న 42 మందికీ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు తొలిగిపోయాయని చక్కగా పెళ్ళి చేసుకున్న శ్రీశాంత్ తదితరులకు చిక్కులు మళ్ళీ మొదలైనట్లు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ -6 జరిగిన సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌తో సహా 42మంది స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు 2013లో కేసు నమోదు చేశారు. అయితే ఆధారాలు బలంగా లేవనే కారణంతో కింది కోర్ట్ ఈ ఏడాది జులై 25న నిందితులపై ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ భాగస్వామి రాజ్ కుంద్రాలకు స్పాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయముందంటూ సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ తేల్చిన సంగతి తెలిసిందే. వారిద్దరిపై జీవితకాలం సస్పెన్షన్ విధించింది. రెండేళ్ళపాటు ఈ రెండు జట్లూ ఐపీఎల్లో పాల్గొనకూడదని తీర్పు ఇచ్చింది.