విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలో… తమ ఆదేశాలను ఉల్లంఘించడంపై హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయాలని తాము ఆదేశించినా ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తక్షణం… విద్యుత్ తీసుకున్న కంపెనీలకు రూ.1400 కోట్లు కట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ..వాటిని రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. అవినీతి ఉంటే.. ఆధారాలు సమర్పించాలని.. కేంద్రం అడిగినా స్పందించలేదు.
ఈ వ్యవహరం అంతర్జాతీయ పెట్టుబడులపై సైతం.. ప్రభావం చూపడంతో కేంద్రం ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ.. ముఖ్యమంత్రి జగ్నమోహన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఏపీ సర్కార్‌తో పీపీఏలు కుదుర్చుకున్న సంస్థలన్నీ… హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానంలో.. ఒప్పందాల ప్రకారం.. విద్యుత్ కొనుగోలు చేయాలని.. కొనుగోలు చేసిన వాటికి డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఏపీ సర్కార్.. విద్యుత్ కోతలు విధించింది కానీ… ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయలేదు.
ఇప్పటికీ విద్యుత్ కొనుగోలు చేయకపోతూండటాన్ని ఆ సంస్థలు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన హైకోర్టు… విద్యుత్ కొనుగోలు సంస్థలకు రూ. 1400 కోట్లు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు విషయంలో తమ ఆదేశాలు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పీపీఎల విషంలో ప్రభుత్వం అవినీతి జరిగిందని వాదించడం లేదు. ఇలా వాదిస్తే ఆధారాలు సమర్పించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. ఇతర కారణాలు చూపిస్తూండటంతో… ప్రభుత్వ వాదనలో బలం లేకుండా పోయిందన్న అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో వ్యక్తం అవుతోంది.