ఇంగ్లిష్ మీడియం విషయంలో పట్టుదలగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎలాగైనా వచ్చే ఏడాది నుండి …ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలనుకున్న జగన్కు.. మొదటగా శాసనమండలిలో అడ్డంకి ఏర్పడింది. అక్కడ బిల్లు పాసవలేదు. తాజాగా.. హైకోర్టు కూడా.. నోటీసులు జారీ చేసింది. ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు ప్రింట్ చేయవద్దని ఆదేశించింది. ప్రాధమిక విద్యలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ..విడుదల చేసిన జీవోని సవాల్ చేస్తూ బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
జీవో అమలును నిలిపివేయాలని, మీడియంని ఎంపిక చేసుకునే హక్కు.. తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లీషు మీడియం పుస్తకాలను ప్రింట్ చేయవద్దని ఆదేశించింది. తమ ఆదేశాలను కాదని.. ప్రింట్ చేస్తే.. ఖర్చు అధికారుల నుంచి వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ జనవరి 27కి వాయిదా వేసింది. ఏపీ సర్కార్ అత్యంత హడావుడిగా వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు నిర్ణయం తీసుకుంది.
అసలే కార్యాచరణకు తక్కువ సమయం ఉందని భావిస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు మరింత ఇబ్బందికరం. విద్యా సంవత్సరానికి అవసరమైన పుస్తకాలను … విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే.. ఆరు నెలల ముందుగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ సారి పూర్తి ఇంగ్లిష్ మీడియం కావడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తాజాగా హైకోర్టు ఉత్తర్వులు మరింత ఇబ్బందికరంగా మారాయి.