దిశ అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నలుగురు నిందితులు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నలుగురి మ్రుత దేహాలకూ మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. మొదట పోస్టుమార్టంపై తమకు అనుమానాలున్నాయంటూ పిటిషనర్ వాదించారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రి వైద్యులు పోస్ట్ మార్టం చేశారనీ, మళ్లీ వారితోనే ఈ ప్రక్రియ జరిపితే… అదే పాత రిపోర్టే వస్తుందని వాదనలు వినిపించారు. గాంధీ ఫోరెన్సిక్ వైద్యులపై నమ్మకం లేదన్నారు. దీంతో రీ పోస్ట్ మార్టం మీద ఇవాళ్ల కోర్టులో విచారణలు సాగాయి. మ్రుతదేహాలు ఇప్పటికే డీకంపోజ్ అవుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ కోర్టుకు తెలిపారు. మైనస్ నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మ్రుతదేహాలను భద్రపరచామన్నారు. అయినా సరే 50 శాతం డీకంపోజ్ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో డెడ్ బాడీలను భద్రపరచే సౌకర్యాలు లేవని కోర్టుకు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని స్వతంత్ర ఫోరెన్సిక్ వైద్య బృందంతో రీపోస్ట్ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తియ్యాలని కూడా ఆదేశించింది. దీంతోపాటు, ఎన్ కౌంటర్ సమయంలో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని, వాటిని సి.ఎ.ఎస్.ఎస్.ఎల్.కి పంపించాలని కూడా సిట్ కి కోర్టు ఆదేశించింది.
డిసెంబర్ 6న ఈ నలుగురి ఎన్ కౌంటర్ జరిగింది. ఆ తరువాత, మూడు రోజులకి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి డెడ్ బాడీలను తరలించారు. అప్పటికే అవి కొంతమేరకు డీకంపోజ్ అయిపోయాయని వైద్యులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో కోల్డ్ స్టోరేజ్ లేని పరిస్థితి. వీటిని ఇంకా భద్రపరచడం కొంత కష్టసాధ్యమనే అంశాన్ని వైద్యులు కోర్టుకు తెలిపారు. మరోవారం పాటు డెడ్ బాడీలను ఉంచితే… వందశాతం పాడైపోతాయని చెప్పారు. దీంతో కోర్టు కూడా ఏకీభవించింది. నిజానికి, ఎన్ కౌంటర్ జరిగిన తరువాత పోస్ట్ మార్టం కాగానే… డెడ్ బాడీలను అప్పగించాలనీ, అంత్యక్రియలు నిర్వహించుకుంటామని నిందితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇప్పుడు నిర్వహించే రీపోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబాలకు డెడ్ బాడీలను అప్పగించేయాలని కోర్టు ఆదేశించింది.