అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకొన్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చాలా లోపాలున్నాయని ఆరోపిస్తూ రెండు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు వేసిన పిటిషన్ పై స్పందిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ న్యాయస్థానం స్టే విదించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తీర్పుని హైకోర్టు బెంచిలో సవాలు చేసింది. దానిపై నేడు విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
మొదట ఈ కేసుని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జ్, స్విస్ ఛాలెంజ్ విధానంలో చాలా లోపాలున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ కేసుని అక్టోబర్ 31ని వాయిదా వేసింది. ఒకవేళ హైకోర్టు ధర్మాసనం ఈ స్విస్ ఛాలెంజ్ విదించిన స్టేని తొలగించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఇబ్బందీ ఉండదు కానీ అది కూడా వ్యతిరేకిస్తే చాలా ఇబ్బందులు తప్పవు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది.
ఈ స్విస్ ఛాలెంజ్ విధానంలో కనబడుతున్న లోపాలని, దాని వలన కలిగే నష్టాలని, సమస్యలని ప్రతిపక్షాలు వివరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకే సాగాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరూ ధైర్యంగా ముందుకు వచ్చి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పకపోవడంతో ఈ వ్యవహారంలో భారీగా అవినీతి జరుగుతోందనే వాటి వాదనలకి బలం చేకూరుతోంది.
రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సహకరిస్తానని గట్టిగా చెపుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్దతికే మొగ్గు చూపడం కూడా అనుమానాలకి తావిస్తోంది. దీనిపై కేంద్రప్రభుత్వం కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి. బహుశః అందుకే కేంద్రప్రభుత్వం తరపున, రాష్ట్ర భాజపా నేతలు గానీ ఎవరూ ఈ స్విస్ ఛాలెంజ్ గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదని భావించవలసి ఉంటుంది.
ఒకవేళ ఈ స్విస్ ఛాలెంజ్ విధానం వలన రాష్ట్ర ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థకి మధ్య మున్ముందు ఏవైనా వివాదాలు ఏర్పడితే అప్పుడు వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం లండన్ న్యాయస్థానంలో న్యాయపోరాటం చేయవలసి ఉంటుందని ఇప్పటికే స్పష్టంగా తెలిసింది. ఒకవేళ తెదేపా, భాజపాల తెగతెంపులు చేసుకొని దూరం అయితే అప్పుడు కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకపోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికలలోగానే వివాదం ఏర్పడి లండన్ న్యాయస్థానంలో పోరాటం చేయవలసి వస్తే అది కూడా రాష్ట్ర ప్రజలలో తెదేపాపై తీవ్ర వ్యతిరేకతని ఏర్పరచవచ్చు.
ఆవిధంగా కూడా తెదేపాకి ఎన్నికలలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఇన్ని సమస్యలు కళ్ళకి కట్టినట్లు కనబడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానానికే మొగ్గు చూపితే దాని వలన కలిగే మంచి చెడులకి అదే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.