అట్రాసిటీ కేసుల్ని రాజకీయంగా వాడుకోవడానికి పూర్తి స్థాయిలో అలవాటు పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హైకోర్టులో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అట్రాసిటీ కేసులు చెల్లవని హైకోర్టు వరుసగా రెండో రోజు తీర్పు ఇచ్చింది. కొద్ది రోజుల కిందట.. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులపై అట్రాసిటీకేసులు పెట్టారు. అలా కేసులు పెట్టిన వారిలో ఎస్సీ రైతులు కూడా ఉన్నారు. వారు చేసిన తప్పేమిటంటే… మూడు రాజధానులకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి మనుషుల్ని కూలీకి తీసుకువస్తున్న వారిని ఆపి.. ఎక్కడి నుంచి వస్తున్నారని అడగటం. ఆ పెయిడ్ కూలీల గురించి.. సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. పోలీసులు ఓ వ్యక్తి దగ్గర ఫిర్యాదు తీసుకుని ఆ రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. తర్వతా వారి చేతులకు బేడీలు వేసిన ఘటన కూడా కలకలం రేపింది.
అప్పుడే.. ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడా సెక్షన్లను ఎత్తి వేస్తూ.. హైకోర్టు తీర్పు చెప్పింది. మంగళవారం కూడా.. అట్రాసిటీ కేసుల విషయంలో హైకోర్టు ఇలాంటి తీర్పు చెప్పింది. పులివెందులలో ఓ దళిత మహిళ అత్యాచారం, హత్యకు గురయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ.. చలో పులివెందుల నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇందులో టీడీపీ ఎస్సీ నేత వంగలపూడి అనితపైనా కేసు పెట్టారు. దీంతో ఆమె కోర్టులో పిటిషన్ వేసింది.
ఆమె సర్టిఫికెట్లను పరిశీలించి కేసు ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. మిగిలిన వారిపై నాలుగు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఏపీలో కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత రాజకీయ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడం కామన్ అయిపోయింది. రాజకీయ నేతల్ని బెదిరించాలంటే… అట్రాసిటీ కేసులే ఆయుధంగా మారాయి. దీనిపై తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ తగ్గలేదు. చివరికి ఎస్సీలపైనా అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఆ కేసుల్ని కొట్టి వేస్తున్నా.. ఇప్పటికి వారు టార్చర్ అనుభవించారు.