ఉత్తరాఖండ్ లో కేంద్రప్రభుత్వానికి మళ్ళీ ఇవ్వాళ్ళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో హరీష్ రావత్ ప్రభుత్వాన్ని భాజపా తిరుగుబాటు అభ్యర్ధుల సహాయంతో కూల్చివేసిన తరువాత, కేంద్రప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. అప్పుడు ముఖ్యమంత్రి హరీష్ రావత్ రాష్ట్ర హైకోర్టులో దానిని సవాలు చేయగా హైకోర్టు సింగిల్ జడ్జ్ రాష్ట్రపతి పాలనపై స్టే విధించి, శాసనసభలో బలనిరూపణకు ముఖ్యమంత్రికి అవకాశం కల్పించారు. దానిని మళ్ళీ కేంద్రప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచిలో సవాలు చేయగా, సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును అది నిలిపివేయడంతో హరీస్ రావత్ తీవ్ర నిరాశ చెందారు.
ఇదే వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో మరొక పిటిషన్ కూడా దాఖలయింది. దానిని నేడు విచారణకు చేపట్టిన రాష్ట్ర హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఈసారి కేంద్రప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు తనకు మరికొంత సమయం కావాలని కేంద్రప్రభుత్వం తరపున న్యాయవాది చేసిన అభ్యర్ధనను తిరస్కరించి, తక్షణమే దీనిపై కేంద్రం తన వాదనలు వినిపించాలని ఆదేశించింది. ఒకవేళ కేంద్రానికి ఆ అవకాశం ఇచ్చి ఉండి ఉంటే, ఈ కేసుపై వాయిదాలు కోరుతూ మరికొన్ని రోజులు సాగదీస్తూ ఈలోగా ముఖ్యమంత్రి హరీష్ రావత్ కి మద్దతుగా ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలని కూడా భాజపా తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేయడానికి అవకాశం దక్కేది. కానీ హైకోర్టు కేంద్రానికి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో తప్పనిసరిగా దీనిపై వాదనలు వినిపించి, తన నిర్ణయం సరయినదేనని నిరూపించుకోవలసి వచ్చింది.
ఈ కేసులో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టి, రాష్ట్రపతి పాలనపై మళ్ళీ స్టే విధించినట్లయితే, మోడీ ప్రభుత్వం అప్రదిష్టపాలవుతుంది. ఒకవేళ హరీష్ రావత్ కి శాసనసభలో తన బలం నిరూపించుకొనేందుకు హైకోర్టు మళ్ళీ అవకాశం కల్పించితే, ఆయన తన బలం నిరూపించుకోగలిగితే మోడీ ప్రభుత్వానికి అది మరోసారి చెంపదెబ్బ కొట్టినట్లే అవుతుంది.