ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై ప్రస్తుతం ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతోంది. బుధవారం ఆ కేసుని విచారణకు చేపట్టిన చీఫ్ జస్టిస్ కె.ఎం. జోసఫ్, జస్టిస్ వికె బిస్త్ లతో కూడిన ధర్మాసనం రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వంపై సంచలన వ్యాక్యలు చేసింది.
“రాష్ట్రపతి నిర్ణయమయినా కూడా న్యాయస్థానాలలో విచారణకు నిలబడేదిగా ఉండాలి. ఆయన నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనడం సరికాదు. రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వ్యక్తులు పొరపాట్లు చేయరని అనుకోలేము. కేంద్రప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగానే ఆయన నిర్ణయం తీసుకొంటారు. కనుక ఒకవేళ ఆ సమాచారంలో తప్పు లేదా పొరపాటు ఉన్నట్లయితే ఆయన నిర్ణయంలో కూడా పొరపాటు చోటుచేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే గవర్నర్ లేఖలో అటువంటి పొరపాటే జరిగిందని మేము భావిస్తున్నాము. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించమని సిఫార్సు చేస్తూ మార్చి 19న గవర్నర్ ఆయనకి వ్రాసిన లేఖలో ఎక్కడా శాసనసభలో 35 మంది సభ్యులు ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్ జరపాలని కోరినట్లు పేర్కొనలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 9మంది ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా లేదు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ ని మార్చి 28న శాసనసభలో బలనిరూపణ చేసుకోమని గవర్నర్ స్వయంగా చెప్పినప్పుడు మళ్ళీ అంతలోనే రాష్ట్రపతి పాలన విదించమని సిఫార్సు చేసారు! అందుకు ఆయన తన లేఖలో బలమయిన కారణాలు కూడా పేర్కొనలేదు. మరి అటువంటప్పుడు రాష్ట్రపతి తన ముందు ఉంచబడిన అసమగ్ర సమాచారం ప్రకారమే నిర్ణయం తీసుకొన్నారని భావించవచ్చు. కనుక ఆ నిర్ణయం పొరపాటు అయ్యే అవకాశం ఉంది,” అని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ గవర్నర్ ఆదేశం ప్రకారం మార్చి 28న శాసనసభలో బలనిరూపణకి సిద్దమవుతుంటే, రావత్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ మార్చి 27 సాయంత్రం హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించింది. నిజానికి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి కేంద్రప్రభుత్వమే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రావత్ ప్రభుత్వానికి బలనిరూపణకి అవకాశం ఇవ్వకుండా హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ మరోమారు అపహాస్యం చేసింది. చేసిన తప్పులను ఒప్పుకోకుండా సరిదిద్దుకోనందుకు ఇప్పుడు న్యాయస్థానం చేత మొట్టికాయలు వేయించుకొంటోంది. అది చేసిన పొరపాటుకి రాష్ట్రపతిపై కూడా న్యాయస్థానం ఇటువంటి వ్యాక్యలు చేసేలా చేసింది.