చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… వివేకా హత్య కేసును నీరుగారుస్తారన్న అనుమానంతోనే జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరారని.. ఇప్పుడు ఆ అవసరం లేదని భావిస్తున్నారని…అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె సునీత సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కీలక వాదనలు వినిపించారు. అయితే..ఈ వాదనపై.. వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు.
కర్నూలులోని ఓ కేసును సీబీఐకి ఇస్తామని ప్రకటన చేశారని.. వివేకా కేసులో అలా ఇవ్వడానికి అభ్యంతరమేంటని పిటిషనర్ తరపున లాయర్ ధర్మాసనం దృష్టికితీసుకెళ్లారు. గత విచారణ సందర్భంగా…హైకోర్టు ఆదేశించినట్లుగా పోస్టుమార్టం నివేదిక, జనరల్ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా…సాంకేతిక పరిజ్ఞానంతో సంక్లిష్టమైన కేసుల్ని చేధించిన పోలీసులకు.. కళ్ల ముందు కనిపించే సాక్ష్యాలున్నప్పటికీ.. వివేకా హత్య కేసును మాత్రం కొలిక్కి తేలేకపోతున్నారు.
పదిహేను వందల మందికిపైగా అనుమానితులని కోర్టుకు చెప్పి.. పోలీసులు అభాసుపాలయ్యారు. సీఎం సోదరి స్వయంగా ప్రభుత్వ విచారణపై.. పోలీసులపై నమ్మకం లేదని హైకోర్టుకే తెలిపింది. విచారణలో వేగం లేకపోవడం… బాధితులు… ఆరోపణలు ఉన్న వారు కూడా.. సీబీఐ విచారణకే డిమాండ్ చేయడంతో.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ ప్రారంభమయింది.