వైకాపా ఎమ్మెల్యే రోజాకి హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిలిపివేసింది. రోజాపై శాసనసభ విధించిన ఏడాది సస్పెన్షన్ రూల్ 340 కి వ్యతిరేకంగా ఉంది కనుక స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ మధ్యంత ఉత్తర్వులు జారీ చేస్తే, దానిని తెదేపా శాసనసభ కార్యదర్శి హైకోర్టు బెంచ్ లో సవాలు చేసారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరిస్తూ, హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది కనుక ఈరోజు శాసనసభలో కూడా రోజా సస్పెన్షన్ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇంతకు ముందు హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పుడు తమ పార్టీకి న్యాయవ్యవస్థల పట్ల చాలా గౌరవం ఉందని, కానీ కోర్టు ఆదేశాలను గౌరవించకుండా తెదేపా ప్రభుత్వం న్యాయవ్యవస్థల పట్ల అనుచితంగా ప్రవర్తించిందని వైకాపా సభ్యులు ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆ పరిస్థితి మళ్ళీ తారుమారవుతుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెదేపాకు అనుకూలంగా, ఆమోదయోగ్యంగా ఉంది కనుక దానిని గౌరవిస్తున్నట్లు తెదేపా నేతలు చెప్పుకోవచ్చును. హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేయాలని వైకాపా ఆలోచిస్తోంది కనుక ఆ పార్టీయే న్యాయవ్యవస్థల తీర్పులను అనుమానిస్తోందని వారు వాదించవచ్చును. ఏమయినప్పటికీ ఇది వైకాపాకి ఊహించని దెబ్బే అని చెప్పవచ్చును.