శ్రీకాకుళం జిల్లాలో సముద్రపు ఇసుక నుండి విలువయిన ఖనిజాలను వెలికి తీసి ట్రైమాక్స్ సంస్థ విదేశాలకు ఎగుమతి చేసి మంచి లాభాలు ఆర్జించుకొంటోంది. అదేమీ నేరం కాదు. అయితే ఆ సంస్థకు 1700 ఎకరాలలో మాత్రమే ఇసుక తవ్వకానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే ఆ సంస్థ అదనంగా మరో 390 ఎకరాలలో కూడా త్రవ్వేసుకొంది. భాజాపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి ఆ సంస్థ విచ్చలవిడిగా సముద్రపు ఇసుకను త్రవ్వేసుకొంటోందని, దానిపై తక్షణం చట్టప్రకారం చర్యలు చేపట్టాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం ట్రైమాక్స్ సంస్థకు ఇసుక త్రవ్వకాలకు అనుమతులు నిలిపివేస్తూ కొన్ని రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై ఆ సంస్థ హైకోర్టుని ఆశ్రయించగా, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలపై స్టే మంజూరు చేసింది.
ఈ సంస్థ కోనేరు రాజేంద్ర ప్రసాద్ కి చెందినది. ఆయన వైకాపాలో ఉండేవారు. తన సంస్థపై ఆరోపణలు రాగానే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆయన వైకాపాకి రాజీనామా చేసారు. అయినా ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన తరపున వాదించిన న్యాయవాది, ట్రైమాక్స్ సంస్థ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, అయినా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసమే తన క్లైంట్ సంస్థకి అనుమతులు రద్దు చేసినట్లు అనుమానిస్తున్నామని వాదించారు. ఒకవేళ ట్రైమాక్స్ సంస్థ అక్రమంగా ఇసుక త్రవ్వకాలకు పాల్పడినట్లు గుర్తించినా మైనింగ్ నిబంధనల ప్రకారం సంస్థకి 50 రోజులు గడువు ఇవ్వవలసి ఉంటుందని, కానీ అంతవరకు కూడా సంస్థకి గడువు ఇవ్వకుండా, సంజాయిషీ కోరకుండా అనుమతులు రద్దు చేయడం సరికాదని వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ స్టే మంజూరు చేశారు.