హెచ్సీఎల్ కంపెనీ విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఉన్న క్యాంపస్ ను విస్తరించేందుకు నిర్ణయంచుకుంది. గతంలో లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో హెచ్సీఎల్ ను విజయవాడలో పెట్టేలా ఒప్పించారు. టీడీపీ హయాంలోనే క్యాంపస్ నిర్మాణం పూర్తయింది. అయితే తర్వాత ప్రభుత్వం మారడం. .. కరోనా పరిస్థితుల కారణంగా క్యాంపస్ లో కార్యకలాపాలు పెద్దగా సాగలేదు. గత ఏడాదిగా హెచ్సీఎల్ ఊపందుకుంది. ఇప్పుడు అక్కడ ఐదు వేల మంది వరకూ పని చేస్తున్నారు.
విస్తరణ చేపట్టి మరో పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని హెచ్సీఎల్ భావిస్తోంది. ఆ కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు మంగళవారం నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ విస్తరణ ప్రణాళికల్ని వివరించారు. తమ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. హెచ్సీఎల్ రెండో దశ విస్తరణలో పదిహేను వేల మందిని నియమించుకుంటారు.
హెచ్సీఎల్ యాజమాన్యం టైర్ టు నగరాల్లో యువతకు ఉద్యోగావకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే గత ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహారించడంతో.. విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు హెచ్సీఎల్ యాజమాన్యం కూడా బెజవాడ విషయంలో ముందుకు వచ్చింది.