ఏ నగరంలో అయినా.. ఓ రంగానికి గట్టి పునాది పడాలంటే.. దానికి సంబంధించిన ఓ భారీ పరిశ్రమ వస్తే చాలు. దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ కేంద్రాన్ని పెట్టేలా బిల్‌గేట్స్‌ను ఒప్పించడం… హైదరాబాద్ రాతనే మార్చేసింది. ఇప్పుడు అలాంటి ఓ ఘటన అమరావతిలోనూ చోటు చేసుకుంటోంది. దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ అమరావతిలో తన క్యాంపస్‌కు నేడు భూమి పూజ చేయబోతోంది. ఆంధ్ర రాజధాని ప్రాంతానికి ఐటీ కళ హెచ్‌సీఎల్ టెక్నాలజీ పార్కు తీసుకురానుంది. ఈ పార్క్ నిర్మాణ పనులు నేటి సాయంత్రం జరగనున్నాయి. హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోషిణీ నాడార్ మల్హోత్రా, హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రా, హెచ్‌సీఎల్-విజయవాడ డైరెక్టర్ ఆర్.శ్రీనివాసన్ ఇప్పటికే.. ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆకట్టుకునే ఆర్కిటెక్చర్ నైపుణ్యంతో కూడిన భవన సముదాయ నమూనాలను హెచ్‌సీఎల్ విడుదల చేసింది.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా పచ్చటి ప్రకృతి నడుమ దీనిని నిర్మించనున్నారు. టెక్నాలజీ పార్కులో మొత్తం మూడు బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తారు. వీటికి అభిముఖంగా వలయాకారంలో మరో భవనం నిర్మిస్తారు. విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున… ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతించిన ఎత్తులోనే భవనాలను నిర్మిస్తారు. మొత్తం 27 ఎకరాల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ పార్కు ఏర్పాటవుతోంది. ఫార్చూన్ కంపెనీల జాబితాలో హెచ్‌సీఎల్ 650 స్థానంలో ఉంది. 41 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన దేశంలో 140 చోట్ల హెచ్‌సీఎల్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సంస్థలో మొత్తం 1.24 లక్షల మంది పని చేస్తున్నారు. ఐటీ, అర్అండ్డీ రంగాలలో హెచ్‌సీఎల్‌కు ఎంతో పేరుంది.
స్పెషల్ ఎకనమిక్ జోన్ కింద టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హెచ్‌సీఎల్ సంస్థ రాజధానిలో రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఫలితంగా 7500 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల ఏర్పాటు చేస్తుంది. అంతేకాదూ… ఐటీ ఆధారిత సేవలు కూడా అందిస్తుంది. దీంతోపాటు ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి… ఏటా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 40 వేల మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తుంది. అమరావతికి పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి హెచ్‌సీఎల్ ఓ దిక్సూచీలా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం టెక్ వర్గాల్లో ఉంది.