హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ దీక్షలు చేస్తున్న విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీలోని దళిత అధ్యాపకులు కూడా మద్దతు పలికారు. పదిమంది ప్రొఫెసర్లు పాలనాపరమైన పదవులకు రాజీనామాలు చేశారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరాని నిన్న ఈ వ్యవహారంపై స్పందించిన తీరుపై ఈ అధ్యాపకులు మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను దళిత-దళితేతర వివాదంగా చిత్రీకరించటానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ స్మృతి వ్యాఖ్యానించటానికి నిరసనగా తాము రాజీనామాలు చేస్తున్నామంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ టీచర్స్ అండ్ ప్రొపెసర్స్ ఫోరమ్ ప్రతినిధులైన అధ్యాపకులు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. రోహిత్ తదితరులను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ కమిటీలో దళిత ప్రొఫెసర్ కూడా ఉన్నాడని స్మృతి ఇరాని పేర్కొనటాన్ని తప్పుబట్టారు. అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రోహిత్‌తో పాటు సస్పెన్షన్‌కు గురైన మిగిలిన నలుగురు విద్యార్థులపై ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని, వారిపై పెట్టిన పోలీస్ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.