హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మరణం తరువాత సుమారు రెండు మూడు వారాలు అట్టుడికిన సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న సమయంలో కన్నయ్య కుమార్ రాక కారణంగా ఒక్కసారిగా యుద్దవాతావరణం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు యూనివర్సిటీని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని బయట వారెవ్వరినీ లోపలకి రానీయకుండా అడ్డుకొంటున్నారు. దానితో యూనివర్సిటీ విద్యార్ధులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యి పోలీసులపై రాళ్ళు రువ్వారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీలు ప్రయోగించవలసి వచ్చింది. దానితో యూనివర్సిటీలో ఇంకా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు యూనివర్సిటీలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనని కూడా అడ్డుకొన్నారు. దానితో అది మరో గొడవగా మారింది. ఇన్ని రోజులు శలవుపై వెళ్ళిన యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ అప్పారావు నిన్ననే మళ్ళీ తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించడంతో అందుకు నిరసనగా విద్యార్ధులు ఆయన కార్యాలయమలో ఫర్నీచర్ న్ని ద్వంసం చేసారు.
మరికొద్ది సేపటిలో డిల్లీ, జె.ఎన్.యు.విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ యూనివర్సిటీకి రాబోతున్నాడు. అతని రాకను నిరసిస్తూ యూనివర్సిటీ ఏ.బి.వి.పి విద్యార్ధి సంఘం ఆందోళన చేపట్టగా, కన్నయ కుమార్ కి మద్దతుగా మరికొన్ని విద్యార్ధి సంఘాలు యూనివర్సిటీలో ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఇదే సమయంలో రోహిత్ తల్లి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో దీక్షకి కూర్చోన్నట్లు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితమే అతను శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. అతను యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రోహిత్ స్మారక స్థూపం వద్ద రోహిత్ కి నివాళులు అర్పించిన తరువాత, రోహిత్ తల్లిని పరామర్శించాలనుకొంటున్నాడు. ఆ తరువాత విద్యార్ధులను ఉద్దేశ్యించి ప్రసంగించాలని భావిస్తున్నాడు. అయితే అతనిని ఎట్టిపరిస్థితులలో కూడా యూనివర్సిటీ లోపలకి అనుమతించబోమని యూనివర్సిటీ అధికారులు తేల్చి చెప్పడంతో విద్యార్ధులు యూనివర్సిటీ బంద్ కి పిలుపిచ్చారు. ఒకవేళ అతను బలవంతంగా లోపలకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అరెస్ట్ చేయడం తధ్యం. అదే జరిగితే మళ్ళీ అదొక సరికొత్త వివాదంగా మారే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక యుద్ద భూమిలా తయారయింది.