హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదానికి మూలకారణమైన సుశీల్ కుమార్ యాదవ్ ఇవాళ మీడియా ముందుకొచ్చాడు. యూనివర్సిటీలో పరిణామాలపై తన వెర్షన్‌ను వివరించాడు. రోహిత్, అతని సహచరులను తాను గూండాలని ఫేస్ బుక్‌లో కామెంట్ పెట్టానని, దానికిగానూ తనను వారు కొట్టారని చెప్పాడు. భావప్రకటన స్వేఛ్ఛ గురించి ఇప్పుడు ఉపన్యాసాలిస్తున్న మేధావులు – అర్ధరాత్రి ఏఎస్ఏ విద్యార్థులు తన రూమ్‌కు వచ్చి తనను కొట్టటం గురించి, తనతో బలవంతంగా అపాలజీ లెటర్ రాయించటం గురించి ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించాడు. రోహిత్‌తో తనకు ఎలాంటి గొడవలూ లేవని చెప్పాడు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని అన్నాడు. అతను చనిపోవటానికి వ్యక్తిగత కారణాలున్నాయని చెప్పాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని చెప్పాడు. రోహిత్ ఆత్మహత్యకు కారణమని కోర్ట్ తేల్చితే ఎలాంటి శిక్ష అనుభవించేందుకైనా సిద్ధమని అన్నాడు. అసలు రోహిత్ కొద్ది రోజులుగా డిప్రెస్డ్గా ఉంటే, పక్కనున్నవారు ఏమి చేస్తున్నారని కొత్త ప్రశ్నను సుశీల్ లేవనెత్తాడు. రోహిత్ మృతికి తాను కూడా ఎంతో బాధపడ్డానని, నాలుగు రోజులపాటు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయానని చెప్పుకొచ్చాడు.