తెలంగాణా శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మరణం గురించి, అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి చర్చించి, యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడటానికి కారకుడయిన వైస్ ఛాన్సిలర్ అప్పారావుని తక్షణమే ఆ పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. హెచ్.సి.యు. సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ “రోహిత్ మరణం నాకు చాలా బాధ కలిగించింది. చనిపోయిన ఆ విద్యార్ధి ఏ కులానికి చెందినవాడనేది ముఖ్యం కాదు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఇటువంటి సంఘటనలు జరుగకుండా ఎందుకు నివారించలేకపోతున్నామని అందరూ ఆలోచించవలసి ఉంటుంది. యూనివర్సిటీలో ప్రశాంతమయిన వాతావరణం చాలా అవసరం కానీ అక్కడ అనవసరమయిన రాజకీయాలు చాలా నడుస్తున్నాయి. అయితే ఆ యూనివర్సిటీ హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ, అది కేంద్రం పరిధిలో ఉంది కనుక దానిపై పూర్తి నియంత్రణ కేంద్రానికే ఉంటుంది. కనుక దానిలో పరిస్థితులను చక్కదిద్దవలసిన బాధ్యత కూడా దానికే ఉంటుంది. వైస్ చాన్సిలర్ అప్పారావుపై తెలంగాణా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ త్వరలో నేను ప్రధాని నరేంద్ర మోడిని కలిసినపుడు ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడుతాను. యూనివర్సిటీలో విద్యార్ధుల హాస్టల్స్ కి విద్యుత్ సరఫరా, నీళ్ళు, మెస్ వంటివి బంద్ చేయడం సరికాదు,” అని కేసీఆర్ అన్నారు.