2019లో దేశంలో 1996 రాజకీయాలు మళ్లీ పునరావృతమవుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడులు వ్యూహాత్మకంగా ఉంటాయని ఆయన ప్రశంసించారు. బీజేపీయేతర కూటమి చర్చల కోసం.. చంద్రబాబు బెంగళూరు వెళ్లారు. చంద్రబాబు ప్రయత్నాలకు వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. సెక్యులర్ శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని.. దేవేగౌడ అభిలాష వ్యక్త చేశారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందన్నచంద్రబాబు అభిప్రాయంతో దళపతులు ఇద్దరూ ఏకీభవించారు. దేవేగౌడ, కుమారస్వామితో దాదాపుగా 40 నిమిషాల పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు. దేవెగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరు వచ్చానని చంద్రబాబు చెప్పారు.
మొదటి నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఆయన మద్దతు కోరామని తెలిపారు.. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించుకునేందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందనినారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని .. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపినట్లు చంద్రబాబు వివరించారు. శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. దీనికోసం దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీయేతర కూటమిపై చంద్రబాబుతో చర్చలు జరిపామని.. కూటమి ఏర్పాటులో కాంగ్రెస్ కూడా తమతో కలిసివస్తోందని దేవెగౌడ అన్నారు.
కూటమి బలోపేతం కోసం మిగతా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబుని కోరినట్లు ఆయన వివరించారు. టీడీపీ – జేడీఎస్ పాతమిత్రులేనని కుమారస్వామి వ్యాఖ్యానించారు. లౌకికవాద శక్తులను ఏకం చేసే విషయంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి ప్రశంసించారు. ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న జేడీఎస్… ఇంత కన్నభిన్నమైన స్పందన వ్యక్తం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. దానికి తగ్గట్లుగానే.. వారు కూడా.. కూటమిలో భాగస్వాములవుతామని ప్రకటించారు.