రాజమండ్రి ఎంపీ భరత్ కు రోషం పొడుచుకు వచ్చిది.తాను తల్చుకుంటే పది హిట్ సినిమాలు తీస్తానని ఆయన ఆవేశపడిపోయారు. దీనికి కారణం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏక చిత్ర నటుడని సంబోధిస్తూ ఉంటారు. భరత్ చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. చదువు ఒంటబట్టక డిస్కంటిన్యూ చేసి ఇండియాకు వచ్చేశారు. తర్వాత సినిమా ప్రయత్నాలు చేశారు. తండ్రి బీసీ ఉద్యమాల పేరుతో తిరగడమే కాకుండా.. దండిగా ఆస్తిపాస్తులు కూడా ఉండటంతో.. సినిమా హీరో అవ్వాలన్న తన కోరికను కూడా తీర్చుకున్నారు.
ఓయ్ నిన్నే పేరుతో ఓ సినిమా తెరక్కించారు. కానీ ఆ సినిమా కనీస మాత్రం ఆడలేదు. వచ్చినట్లుగా కూడా తెలియదు. తర్వాత చాన్సులిచ్చేవారు కూడా లేకపోవడం… తండ్రి కూడా డబ్బులు పెట్టకపోడవంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఆయన ఎప్పుడూ రీల్స్ చేసుకుంటూ ఉంటారు. ఆయనపై సోషల్ మీడియాలో రీల్స్ ఎంపీ అనే ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తనను ఏక చిత్ర నటుడు అని రఘురామ అనడంపై ఆయనకు రోషం పుట్టింది. ప్రెస్ మీట్ పెట్టి.. తాను తలచుకుంటే హీరోగా 10 సినిమాల్లో నటించగలనని, సూపర్ స్టార్ అవ్వగల సత్తా తనకు ఉందని ప్రకటించుకున్నారు.
తాను సినిమాలు చేస్తే జనాలు ఆదరిస్తారని, తనకు ఉన్న ఫేస్ గ్లామర్ అటువంటిదని స్వకుచమర్దనం చేసుకున్నారు. అవసరమైతే సీఎం జగన్ అనుమతి తీసుకొని పది సినిమాల్లో హీరోగా చేయగలనని అన్నారు. రఘురామ కృష్ణంరాజు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ఆయన కామెడీ యాక్టర్‌కు తక్కువ.. పనికిమాలిన యాక్టర్‌కు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా తాను లేవను కానీ.. లేస్తే మనిషిని కాదన్న తరహాలో… భరత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆయనను మరోసారి ట్రోలింగ్ కు కారణమయ్యేలా ఉన్నాయి.