ఈరోజుల్లో చాలా మంది ప్రజలు కార్పోరేట్ ఆసుపత్రులలోనే చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడతారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళాలనుకోరు. ఇక రాజకీయ నాయకుల సంగతి సరే సరి. చిన్న స్థాయి రాజకీయ నేతలు కూడా కార్పోరేట్ ఆసుపత్రులలోనే చికిత్స తీసుకోవడం సర్వ సాధారణమయిపోయింది. కార్పోరేట్ కళాశాలలు, ఆసుపత్రులలో ఖర్చులను భరించలేని సామాన్య, పేద ప్రజలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కళాశాలలు వంటి వాటిని ఉపయోగించుకొంటున్నారు. ప్రభుత్వాపత్రులలో, ప్రభుత్వ కళాశాలలో నాసి రకమయిన చదువులు, వైద్య సేవలు, లంచగొండితనం, అపరిశుబ్రత నెలకొని ఉంటాయనే కారణంగానే చాలా మంది వాటికి దూరంగా ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజలలో నెలకొన్న ఈ అపోహలు దూరం చేసి, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు, ఈ రోజు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కుడి మోకాలు శాస్త్ర చికిత్స చేయించుకొన్నారు. కొద్ది సేపటి క్రితమే శాస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసిందని దానిలో పాల్గొన్న ఆసుపత్రి ఆర్ధోపెడిక్ విభాగ అధిపతి డా. ప్రశాంత్ తెలిపారు. మంత్రి గారిని ఇవ్వాళ్ళ సాధారణ వార్డులోకి మార్చి ఆదివారంనాడు ఆశుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
ఆసుపత్రిలో చేరే ముందే డా. కామినేని శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఇక్కడ శస్త్ర చికిత్స చేయించుకొంటున్నానని, తన వలన ఆసుపత్రిలో వైద్యం చేయించుకొంటున్న ఇతర రోగులు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనుకొంటున్నాని అన్నారు. కనుక తనను పరామర్శించడానికి ఎవరూ రావద్దని, వచ్చినా ఎవరినీ అనుమతించవద్దని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. కనుక ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే పక్కన ఉన్నారు.
డా. కామినేని శ్రీనివాస రావు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించవలసిందే. ప్రజా ప్రతినిధులు, మంత్రులు అందరూ కూడా విధిగా ప్రభుత్వాసుపత్రులలోనే వైద్య చికిత్స చేయించుకోవాలనే నిబంధన విధించగలిగితే, ప్రభుత్వాసుపత్రుల పనితీరు,వాటి పరిస్థితులు పూర్తిగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. డా. కామినేని శ్రీనివాస రావు కేవలం గుంటూరుకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాసుపత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకొనే విధంగా చర్యలు చేపట్టాలి.