దొంగ చేసిన కత్తి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ చేసి శరీరంలో ఇరుక్కుపోయిన రెండు అంగుళాల కత్తిని బయటకు తీసినట్లుగా ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. మరి కాస్త లోపలికి దిగి ఉంటే సైఫ్ ప్రాణాలు పోయేవని వారు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని మెల్లగా నడుస్తున్నారని కూడా ప్రకటించారు. ఐసీయూ రూమ్ నుంచి జనరల్ రూమ్ కు షిప్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ఒక్క రోజులోనే ఇంత రికవరీ అంటే.. ఆయనకు తీవ్ర గాయాలు కాలేదని అనుకోవచ్చు.
మరో వైపు పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఆరో ఫ్లోర్ లో ఫుటేజీలో దొంగ వీడియోలు దొరికాయని రిలీజ్ చేశారు. అలాంటి పోలీకతో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. దొంగను పట్టుకున్నామని మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే కాసేపటికి అంతా రివర్స్ అయిపోయింది. ఆ వ్యక్తి కనీసం బాంద్రా వైపు కూడా రాలేదని తేలడంతో గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారు. తాము ఎవర్నీ అరెస్టు చేయలేదని అధికారికంగా ప్రకటించారు. అసలు నిందితుల కోసం గాలిస్తున్నామని అంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో దొంగ చేసిన దాడి కన్నా.. ఇంకేదో ఉందన్న అభిప్రాయం మాత్రం బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే సైఫ్ కొన్నాళ్ల పాటు బయట కనిపించడం కష్టమే. వారం రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు ప్రకటించారు. ఆయన ఒప్పుకున్న కొన్ని సినిమా షూటింగులు ఆలస్యం కావొచ్చు కానీ.. క్యాన్సిల్ అయ్యే అవకాశాల్లేవని చెబుతున్నారు.