ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరో నెల వాయిదా పడింది. మార్చి 28కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను తొందరగా విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని చెప్పింది.
ఈ పిటిషన్లపై విచారణ చాలా కాలంగా వాయిదా పడతూ వస్తోంది. మొదట జనవరి 31న విచారణ జరపాల్సి ఉంది. ఆ రోజు విచారణకు రాలేదు. ఆ తర్వాత అత్యవసరంగా విచారణ జరపాలని ప్రభుత్వం పిటిషన్ వేసిదంి. విచారణను ఫిబ్రవరి 23న చేపడతామని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డికి తెలిపింది. కానీ ఆ రోజు లిస్ట్ కాలేదు. ఇవాళ మరోసారి ప్రస్తావించడంతో వచ్చే నెల 28న విచారణ చేపడతామని తెలిపింది. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో దాదాపుగా ఆరు నెలల తర్వాత పిటిషన్ దాఖలు చేసింది. అయితే విచారణ మాత్రం అర్డంట్గా జరపాలని ఒత్తిడి తెస్తోంది.
అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం సుప్రీంకోర్టులో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కూడా అమరావతి అంశంపై కౌంటర్ దాఖలు చేసింది. గత ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా స్పష్టం చేసింది. అలాగే రైతులు.. ఇతరులు కూడా తమ కౌంటర్లను దాఖలు చేశారు. వాటిపై సుప్రీంకోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఇప్పటికే ఓ సారి విచారణ జరిపి.. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు చేయాలన్న ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.