ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో ఆమె హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
కవితకు బెయిల్ కోరుతూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్ రావు ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరపనుంది. ట్రయల్ కోర్టు ఆమెకు ఈ నెల 6న బెయిల్ నిరాకరించగానే హైకోర్టును ఆశ్రయిస్తామని కవిత తరఫు న్యాయవాదులు తెలిపారు. అందులో భాగంగా కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా..? అని బీఆర్ఎస్ శ్రేణులు, కవిత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు. తాజాగా ఈడీ కేసులో ఆమెకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కినా సీబీఐ కేసులోనూ బెయిల్ మంజూరు కావాల్సి ఉంటుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మొదట తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరగా అందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత సాదారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినా దానిని కూడా కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఆమె హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది.
ఇదే కేసులో ఆమెను సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో , ఈ కేసులోనూ ఆమె బెయిల్ కోరగా ట్రయల్ కోర్టు నిరాకరించింది. త్వరలోనే ఆమె సీబీఐ కేసులోనూ బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు.