ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో కేటీఆర్ తన న్యాయపోరాటం చివరిదశకు వచ్చారు. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ బుధవారం జరగనుంది.గతంలో అత్యవసరంగా విచారించారని కేటీఆర్ తరపు లాయర్లు చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ ధర్మాసనం తిరస్కరించింది. పదిహేనో తేదీన విచారణ జరుపుతామని తెలిపింది. ఆ ప్రకారం జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఎదుటకు పిటిషన్ రానుంది.
ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు కాబట్టి ఇందులో అసలు కేసే లేదని.. లొట్టపీసు కేసు అని కేటీఆర్ వాదిస్తున్నారు. అందుకే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినప్పుటికీ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్టు చేసేందుకు ఆటంకాలు లేనప్పటికీ ఏసీబీ అధికారులు అరెస్టు చేయలేదు. సుప్రీంకోర్టులో వచ్చే స్పందనను బట్టి ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు మరో రెండు రోజుల్లో ఆయన ఈడీ ఎదుట కూడా హాజరు కావాల్సి ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ రేసు కేసు పెద్ద సంచలనంగా మారింది. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు జరిగింది కాబట్టే కేసులు పెట్టామని కక్ష పూరితంగా ఏమీ చేయలేదని చెప్పుకునేందుకు దూకుడుగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలితే.. ఆ తర్వాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.