హైదరాబాద్ శివారులోని సీఎంఆర్ కాలేజీలో క్రికెట్ ఆడుతూ ఓ కర్రాడు కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి చనిపోయాడని వైద్యులు తేల్చారు. మరో చోట డిగ్రీ అప్పుడే అయిపోయిని విద్యార్థిని తన అనుభవాలను చెబుతూ.. కుప్పకూలిపోయారు. ఆమె కూడా గుండెపోటుతో చనిపోయారు. ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ.. హుషారుగా ఉంటూ కుప్పకూలిపోయారు. ఇవన్నీ గత వారం రోజుల్లో వైరల్ అయిన వీడియోస్. వైరల్ కాకుండా.. జరుగుతున్న ఇలాంటి హఠాత్తుగా మరణాలు ఎన్ని ఉన్నాయో లెక్కించడం కష్టంగా మారుతోంది.
హార్ట్ ఎటాక్ అనేది గతంలో నడి వయసు దాటిన వారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు పట్టుమని ఇరవై ఏళ్లు నిండని వారిని కూడా పలకరిస్తోంది. అది కూడా మాసివ్ హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి. క్షణంలోనే ప్రాణం పోతోంది. జీవితం క్షణ భంగురం అని అందరూ చెప్పుకుంటారు కానీ మరీ ఇలా .. ఏ మాత్రం అనారోగ్య లక్షణాల్లేకుండా.. అప్పటికప్పుడు కుప్పకూలిపోవడం మాత్రం వైద్య నిపుణుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకరిద్దరు అయితే వారికి తెలియని సమస్యలు ఉన్నాయని అనుకోవచ్చు కానీ.. ఎక్కువ మందికి ఇలా జరుగుతూండటం మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.
కరోనా తర్వాత ఎక్కువగా ఇలాంటి హఠాత్ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువతరం ఈ విషయం ఎక్కువగా నష్టపోతోంది. విలువైన జీవితాలను అర్థాంతరంగా ముగించాల్సి వస్తోంది. వీటికి కారణం కరోనా వ్యాక్సిన్లన్న ప్రచారం ఉంది. అదే నిజమైతే విరుగుడు ఆలోచించాల్సిందే కానీ.. కప్పి పుచ్చడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.