భగభగ మండే కాలంలో బతుకు ఎప్పుడూ చల్లగా వుండదు. సత్తువనీ, సత్తానూ కోల్పోయి నిస్సహాయులుగా అశక్తులుగా మారిపోయిన మనుషుల జీవితం ఎలా వుంటుందో పెరిగిపోతున్న ఎండాకాలం కూడా అలాగే వుంటుంది…మార్చి నెలలోనే ఎండ మలమలా మండిపోతోంది
తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. వేడిగాలులు వీస్తున్నందున జనం రోడ్డెక్కేందుకు భయపడుతున్నారు. చాలాచోట్ల పగటిపూట రహదారులపై ట్రాఫిక్ తగ్గుముఖం పట్టింది.
వాతావరణశాఖ సూచికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 37 డిగ్రీలసెంటిగ్రేడ్ , తెలంగాణాలో 40 డిగ్రీలసెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు దాటితే నే ఎండలు బాగా పెరిగినట్టు గుర్తిస్తారు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, నందిగామలో అత్యధికంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ, కర్నూలు, నంద్యాల, తిరుపతిలో 42 డిగ్రీలు, కడప, తుని, జంగమేశ్వరపురంలో 41, నెల్లూరులో 40, బాపట్ల, ఒంగోలులో 39, మచిలీపట్నంలో 38, కాకినాడ, కావలి, నరసాపురం, విశాఖలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణాలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదౌతోంది. ఇప్పటికే వడ గాలుల తీవ్రతకు 9మంది ప్రాణాలు కోల్పోయాయి.. నల్లగొండ జిల్లాలో 8మంది… ఖమ్మం జిల్లాలో ఒకరు చనిపోయారు. ఈసారి ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
పదేళ్లలో ఈ స్థాయి ఉష్ణోగ్రత ఉండటం ఇదే మొదటిసారి. ఏడాదిమొత్తంలో మార్చి 21 వతేదీన పగలు, రాత్రి సమానంగా ఉంటుంది. 24గంటల్లో 12గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటాయి. మిగతారోజుల్లో రాత్రిగానీ పగలుగానీ ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది.. ఈరోజు సూర్యుడు భూమధ్య రేఖపైకి నిట్టనిలువుగా వస్తాడు. అలాంటి ప్రత్యేకత వున్న రోజున ఎండలతోనూ రికార్డు సృష్టించింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 45 డిగ్రీలు, నిజామాబాద్లో 40.4 డిగ్రీలు, ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలో 43 డిగ్రీలు, గన్నవరంలో 42.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నందిగామలో పదేళ్ల అత్యధిక రికార్డు 2014 మార్చి 31న 41.9 డిగ్రీలుగా ఉంది.. దీనికన్నా ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
గత పదేళ్లలో మార్చిలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి… 25నుంచి 31 తేదీలమధ్య ఎండలు మండుతున్నాయి… 2009 మార్చి 2న కాకినాడ, గన్నవరంలలో, మార్చి ఒకటిన నల్గొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గత రెండేళ్లలో ఎల్నినో ప్రభావంవల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా తగ్గిపోయాయి.. రైతులు తీవ్రంగా నష్టపోయారు.. ఈ జులైవరకూ ఎల్నినో ప్రభావం తగ్గి వర్షాలు సాధారణ స్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.