తెలంగాణ అసెంబ్లీకి మళ్లీ ప్రజాస్వామ్యం వచ్చింది. గత పదేళ్లుగా తెలంగాణ అసెంబ్లీలో జరగని చర్చలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి రోజే జరిగాయి. విమర్శలు చేస్తున్న విపక్ష సభ్యులను అడ్డుకోవడం కానీ.. సస్పెండ్ చేయడం కానీ చోటు చేసుకోకుండా.. వారి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ పేరుతో కేటీఆర్ బెదిరింపు వ్యాఖ్యలు చేసినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పారు కానీ.. వారిని గెంటేసి తాము సభను నడిపించాలనుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్ల కాలంలో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరిగిపోయేవి.
ఉన్న విపక్ష సభ్యులందర్నీ బీఆర్ఎస్ లో చేర్చుకునేవారు ఉండే అతి కొద్ది మందిని సస్పెండ్ చేసేవారు . దాంతో ప్రశ్నించే వారు ఉండేవారు కాదు. కానీ రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా చర్చ మాత్రం వాడివేడిగా జరిగింది. రేవంత్ రెడ్డిపై గతంలో చేసిన విమర్శలన్నింటినీ.. కేటీఆర్ సభలో మరోసారి గుర్తు చేసినా ఆవేశపడలేదు. సావధానంగానే సమాధానం చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ తొలి రోజు ఆసక్తికరంగా సాగింది కాంగ్రెస్ కు కేవలం అరవై ఐదు మందే ఉన్నారని.. తమకు యాభై నాలుగు మంది ఉన్నారని కొద్దిగా తేడా వస్తే.. ప్రభుత్వం పతనమవుతుందన్నట్లుగా కేటీఆర్ చేసిన విమర్శలకు.. గట్టి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదని సెటైర్ వేశారు. 51 శాతం ఉన్న వాళ్లు అధికారంలో ఉంటారని.. 49 శాతం ఉన్న వాళ్లు ప్రతిపక్షంలోనే ఉంచారని గుర్తు చేశారు. చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్లుగా.. కాంగ్రెస్ లో రేవంత్ చేరాడన్న కేటీఆర్ విమర్శలకు.. రేవంత్ సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పుట్టలు పెడితే… కేటీఆర్ పాములా దూరాడని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ చర్చల్లో ఎవరు పైచేయి సాధించారు.. అన్నది చూసే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇలా చర్చలు జరగడమే ప్రజాస్వామ్యానికి ముఖ్యం.
ప్రజాస్వామ్య తెలంగాణ తెస్తానని రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఓ అడుగు ముందుకేశారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే.. కేసీఆర్ సర్కార్… రేవంత్ సర్కార్ కు స్పష్టమైన తేడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.