గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీరుతో రోడ్లు, వీధులన్నీ నిండిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు వర్షం దంచి కొట్టడంతో పలు ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లు పేలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ లోని కొన్ని ప్రాంతాల్లో 6 – 8 సెం. మీ. లు వర్షం కురవడంతో కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
మంగళవారం కుండపోత వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సరిగ్గా ఉద్యోగులు ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్ లో వాహనాలు భారీ వర్షంతో ట్రాఫిక్ సమస్యకు గురయ్యాయి. మెట్రోలో కూడా రద్దీ కనిపించింది.
భారీ వర్షానికి మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. దాంతో ప్రయాణికులు మెట్రో స్టేసన్ లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో అధికారులు ఎస్కలేటర్ , లిఫ్ట్ లను ఆపేశారు. దీంతో ప్రయాణికులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ , హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్దం చేయడం లేదని జనాలు అసహనం వ్యక్తం చేశారు. వర్షం కురిసినప్పుడల్లా రోడ్లు , వీధులన్నీ జలమయం కావడం.. ట్రాఫిక్ జామ్ కావడం ఆనవాయితీగా వస్తోందని… ప్రభుత్వాలు మాత్రం వీటిపై సరైన దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.