హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం మంగళవారం తెల్లవారుజుమున మరింత జోరందుకుంది. దిల్ సుఖ్ నగర్ , కొత్తపేట , సరూర్ నగర్ , ఎల్బీనగర్ , నాగోల్ , అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
ఖైరతాబాద్ , నాంపల్లి , బషీర్ బాగ్ , హిమాయత్ నగర్ , అబిడ్స్ , నాంపల్లి , కుత్బుల్లాపూర్ , బాలానగర్ , గాజులరామారం , జగద్జిరిగుట్ట్ట, బహదూర్ పల్లి , సూరారం , సుచిత్ర, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం , బీఎన్ రెడ్డి నగర్ , హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ , అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి.
ఇప్పటికే సోమవారం భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. పరిస్థితి కొంత కుదుటపడుతుండగానే తెల్లవారుజామున కురిసిన వర్షంతో కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షం ధాటికి నాళాలు ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మంగళవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని .. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ కు ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.