హైదరాబాద్: జులై, ఆగస్ట్ నెలల్లో వర్షాలు లేకుండా కరవు ఛాయలతో అల్లాడుతున్న రైతులకు సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలు మంచి ఊరటనిచ్చాయి. సెప్టెంబర్ వానలు పంటలకు జీవం పోశాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో ఈ సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్త సగటు వర్షపాతం గణనీయంగా పెరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో సాధారణంకన్నా అధిక వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలోని 459 మండలాలలోని 207 మండలాలలో సాధారణ వర్షపాతం, 67 మండలాల్లో అధిక వర్షపాతం నమోదయిందని, 179 మండలాల్లో మాత్రం వర్షాభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆరు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 3 మండలాలు, రంగారెడ్డిలో 2 మండలాలు, మెదక్‌లో 2 ఉన్నాయి. ఈశాన్య రుతుపవన కాలం సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఈనెలలో మిగిలిన వారం, పదిరోజులలో మరిన్ని వర్షాలు కురుస్తాయనే సంకేతాలు అందుతున్నాయి. ప్రజలు, రైతాంగంకూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ వర్షపాతంకన్నా తక్కువ ఉన్న మండలాలలోనూ ఈ వారం పదిరోజుల్లో వర్షాలు కురిసి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ప్రజలు, రైతాంగం ఆశిస్తున్నారు.