వైసీపీ హయాంలో విధ్వంసమైన ఏపీని మళ్లీ గాడిన పెడుతానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ప్రకటించిన చంద్రబాబు ఆ దిశగానే సాగుతున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విషయాల్లో తనదైన మార్క్ వేస్తోన్న చంద్రబాబు.. అందుకోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపై తన లక్ష్యాన్ని చాటుతున్నారు.
రాష్ట్రాభివృద్ది కోసం కేంద్రం సహకరించాలని ఇటీవలే ఢిల్లీ వెళ్లిప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు.. ఆ తర్వాత రాష్ట్రంలో ఒక్కొక్క రంగాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. కేంద్రం కూడా ఏపీ అభివృద్ధి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని సానుకూలంగా స్పందించడంతో చంద్రబాబు అభివృద్ధి విషయంలో దూకుడు పెంచారు.
గురువారం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేపట్టారు. పొద్దున్నే పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి ఆ తర్వాత భోగాపురం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి మరో రెండేళ్ళలో ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని, పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత సీఐఐ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు సాయంత్రానికి మెడ్ టెక్ జోన్ లో సమావేశమయ్యారు. రోజంతా ఊపిరిసల్పని షెడ్యూల్ తో బిజీబిజీగా గడిపారు.
74ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు రాష్ట్రాభివృద్ది కోసం ఆరాటపడుతున్న తీరు స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్యాంప్ ఆఫీసు నుంచి కాలు బయటపెట్టేందుకు సంకోచించేవారు. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్దంగా ఈ వయస్సులోనూ తన స్టామినా తగ్గలేదని, నవ యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.