వారసులు సీఎం కుర్చీల కోసం ఎగబడడం అనేది మన తెలుగు రాష్ట్రాలకు కొత్త విషయం కాదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు చోట్ల కూడా వారసులుగా గుర్తింపు పొందిన పుత్ర రత్నాలే సీఎం కుర్చీకోసం కాసుకుని కూర్చుని ఉన్నారన్నది సత్యం. అయితే.. ఈ తాజా వ్యాఖ్య మాత్రం మన తెలుగు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినది కాదు! పొరుగున ప్రస్తుతం ఎన్నికల సమరాంగణంలో బిజీగా ఉన్న తమిళనాడు వ్యవహారాలకు సంబంధించినది. అక్కడ పురట్చితలైవి జయలలితను గద్దెదింపి తాను ఆరోసారి ముఖ్యమంత్రి కావాలని వీల్ఛెయిర్కు మాత్రమే పరిమితమైన వృద్ధనేత కరుణానిధి ఇంకా కలలు కంటున్నారు.
ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధిస్తే గనుక.. స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని డీఎంకే పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం పార్టీకి ఒక రకంగా కొంత మేలు, కొంత చేటు చేసే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. అందుకే కాబోలు ముందు ఓట్ల పర్వం ముగిసే వరకు ఇలాంటి శషబిషలకు తావు లేకుండా కరుణానిధి తమ కూటమి గెలిస్తే సీఎం కాబోయేది తానేనంటూ స్పష్టత ఇస్తున్నారు.
పుకార్ల గురించి ఆయన వద్ద మీడియా ప్రస్తావిస్తే.. తనకు ఏమైనా జరిగితే తప్ప.. స్టాలిన్ ఇప్పుడే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని కరుణానిధి తెగేసి చెప్పడం విశేషం. గతంలో అయినా అన్న అళగిరి, తమ్ముడు స్టాలిన్ మధ్య వారసుడి పదవికోసం ఆధిపత్య పోరాటం ఉండేది. ఇప్పుడు స్టాలిన్ ఒక్కడే వారసుడిగా ఉన్నారు. అయినా సరే.. ముఖ్యమంత్రి కుర్చీ అంత ఈజీగా తన కుమారుడికి దక్కబోయేది లేదని.. కరుణ వివరించడం విశేషం.
మరోవైపు ఆయన జయలలిత మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆమె మేనిఫెస్టో అందరికంటె లేటుగా విడుదల చేసి.. అందరినుంచి కాపీ హామీలను ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జయలలిత హామీలు ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని కూడా అంటున్నారు. నిజానికి డీఎంకే కూడా ఉచిత హామీల మీదనే ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొంటున్నప్పటికీ.. జయలలిత ఉచిత హామీలను మాత్రం ఆయన ఎద్దేవా చేస్తుండడం గమనార్హం.