తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు ఉందని గట్టిగా నమ్ముతున్నారు. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి స్థిరపడేలా చేయడానికి ఇంత కంటే మంచి సమయం ఉండదని అనుకుంటున్నారు. సీనియర్ నేతలంతా.. లోక్ సభ ఎన్నికల్లో తమ వారసులకు లేకపోతే కుటుంబసభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ సారి కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయంతో చాలా నియోజకవర్గాల్లో పోటీ కూడా ఎక్కువగానే ఉన్నది. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కె. జానారెడ్డి తమ వారసుని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ కుమారుడు నాగార్జున సాగర్ నుంచి గెలిచాడు. మరో కుమారుడ్నిఎంపీ చేయాలనుకుటున్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వారసుల పోటు ఎక్కువైంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాదరెడ్డి ప్రయత్నిస్తున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ మైనంపల్లి హన్మంతరావు అడుగుతున్నారు. జహీరాబాద్ టికెట్‌ను తన కూతురు త్రిషలకు ఇప్పించుకునేందుకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నిస్తున్నారు. తన భార్య నిర్మల కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు.
పెద్దపల్లి పార్లమెంటు నుంచి తన కుమారుడు గడ్డం వంశీకి టికెట్టు ఇప్పించుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి ప్రయత్నిస్తున్నారు. భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వారసులకు టికెట్లు అన్న చర్చపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వారసుల పార్టీ అనే ముద్ర ఉంది. దీన్ని చెరుపుకుని కొత్త నాయకత్వాన్ని పెంచుకుంటేనే.. భవిష్యత్ లో .. నాయకత్వానికి ఢోకా లేకుండా ఉంటుందని.. హైకమాండ్ ఆ దిశగా ఆలోచించాలని క్యాడర్ సూచిస్తున్నారు.